దేశంలో రాజకీయ అధినేతలకు కొదవ లేదు. వారి టాలెంట్ గురించి కథలు కథలుగా చెప్పొచ్చు. కానీ.. వారెవరిలోనూ కనిపించని అద్భుతమైన అర్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని చెప్పాలి. ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి నేటి వరకు ఆయన టేకప్ చేసే అంశాలు.. వాటికి సంబంధించి ఆయన చేసే వ్యాఖ్యల్ని నిశితంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డిలోని టాలెంట్ కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు. ఈ తరహాలో మరెవరూ కూడా కనిపించరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసే ఏ అంశమైనా సరే భావోద్వేగానికి కనెక్టు అయి ఉంటుంది. అది కూడా.. ఎవరూ ఏమీ అనలేని పరిస్థితుల్ని.. ఒకవేళ అనే అవకాశం ఉన్నా.. అంటే.. ఎక్కడ చెడ్డ అవుతామన్న భయానికి గురయ్యే పరిస్థితుల్లో ఆయన ఎంట్రీ ఇస్తారు. తాను చెప్పాల్సింది చెబుతారు. అది కూడా ఆకర్షణీయంగా చెప్పటం కనిపించదు. కానీ.. ఆయన చెప్పిన మాటలు నమ్మేలా.. నిజాలు అన్నట్లుగా అనిపిస్తాయి. లాజికల్ గా థింక్ చేసినా కరెక్టేగా అనిపించేలా ఉంటాయి. అంతటి స్క్రిప్టు వర్కు ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వుతో చేస్తారన్న ల్యాబ్ రిపోర్టులు ప్రశ్నిస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. తాను చెప్పిన అంశాల్ని తనకు మద్దతుగా ఉండే వారి వాదనలకు అవసరమైన ముడిసరుకును ఇచ్చేశారు. అక్కడితో ఆగితే జగన్ గొప్పతనం తగ్గిపోదు. తాను సంధించిన ప్రశ్నలకు మరిన్ని ఉప ప్రశ్నలతో ఆయన వర్గీయులు గొంతులు సవరించుకుంటూ సిద్ధమవుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని చూసినప్పుడు ఆది నుంచే వివాదాలతో సహజీవనం చేయటం కనిపిస్తుంది. తాను ఎంపీ కావటం కోసం.. తన చిన్నాన్న మీద చేయి చేసుకున్నట్లుగా ఆరోపించటం కనిపిస్తుంది. అదే చిన్నాన్న తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురైతే.. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అందుకు తగ్గట్లే.. నాటి అధికార పార్టీనే తన చిన్నాన్నను పొట్టన పెట్టుకుందంటూ గుండెలు బాదేసుకున్నారు.
అక్కడితో ఆగని.. ఆయన ఆ నెపాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు రుద్దేశారు. కట్ చేస్తే.. తాను ముఖ్యమంత్రి అయ్యాక చిన్నాన్నను దారుణంగా చంపేసిన వారెవరో తేల్చటం లాంటివి చేయకపోవటం కనిపిస్తుంది. చిన్నాన్న దారుణ హత్యకు ఫలానా వాళ్లు కారణమై ఉంటారంటూ వేళ్లన్నీ చూపిస్తున్నా.. తాను స్వయంగా ముఖ్యమంత్రి అయి కూడా ఎలాంటి చర్యా తీసుకోకపోవటమే కాదు.. కేసు విచారణ ముందుకు వెళ్లనివ్వని ఆయన టాలెంట్ కు అచ్చెరువు చెందే పరిస్థితి.
తన చేతిలో అధికారం లేనప్పుడు తన చిన్నాన్న హత్య చంద్రబాబు అండ్ కో చేసి ఉంటుందని ఆరోపించిన ఆయన.. తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా అసలు నిందితులు ఎవరో తేల్చేసే పని చేయకపోవటం కనిపిస్తుంది. అలా అని.. గతంలో తాను ఆరోపించినట్లుగా చంద్రబాబు పాత్రను నిరూపించి..ఆ కేసులో ఆయన్ను జైల్లో వేసినా బాగుండేది. కానీ.. అలాంటిది కూడా జరగలేదు. చిన్నాన్నను దారుణంగా చంపినోడి సంగతి చూసే లోపే ఐదేళ్ల పుణ్యకాలం గడిచింది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమీ ఎందుకు చేయనట్లు?
హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలు కావటం తెలిసిందే. ఆ మరణంపై కుట్ర కోణాన్ని ప్రపంచానికి తెలియజేయటమేకాదు.. దాని వెనుకున్నది రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అని చెప్పిన తీరు.. ఆ సందర్భంగా వారిఆస్తుల మీద జరిగిన దాడి గురించి తెలిసిందే. కట్ చేస్తే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో ఆ మాటల లెక్కలు ఏమైనట్లు? అన్నది ప్రశ్న.
అంతేకాదు.. తన తండ్రి మరణించిన సమయంలో.. తన తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక 1200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా చెప్పటమేకాదు.. ఆ మాటను ఎస్టాబ్లిష్ మెంట్ చేసిన ఆయన.. అందుకు కొనసాగింపుగా ఓదార్పు యాత్రను చేపట్టటం.. దాని కోసం కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతేనా.. పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఓదార్పు యాత్రతోఅధికారాన్ని వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ముఖ్యమంత్రి అయ్యాక అదే 1200 మంది కథ ఎందుకు పట్టనట్లు? వారి బాగోగుల కోసం తన తండ్రి వైఎస్ ప్రాణమిచ్చే కాంగ్రెస్ పార్టీని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి.. తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? అన్నది ప్రశ్న.
అంత పెద్ద కాంగ్రెస్ మీద ధిక్కార స్వరంతోబయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్న వ్యక్తి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే 1200 మంది కుటుంబాలకు ఏదైనా చేయాలి కదా? ఎందుకు చేయనట్లు? అలానే ఉంటుంది జగన్ వైఖరి. మొన్నటికి మొన్న ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరిన 30 రోజుల అనంతరం ముప్ఫై రోజుల్లో 36 హత్యలు అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జగన్మోహన్ రెడ్డినే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టటం దగ్గర నుంచి నిరసనలు చేసేశారు.
దీనిపై చంద్రబాబు సర్కారు సైతం ఒకసారి ఎందుకైనా మంచిదని నెల రోజుల్లో అన్ని హత్యలు జరిగాయా? అని క్రాస్ చెక్ చేసుకోవటం చూస్తే.. జగన్ వారి టాలెంట్ ఎంతో అర్థమవుతుంది. చివరకు ఎన్ని లెక్కలు వేసుకున్నా.. అసలు అలాంటి హత్యలే జరగలేదన్న విషయంపై ఝూడీ చేసుకున్న తర్వాత.. మీరు చెబుతున్న హత్యలకు సంబంధించి వివరాల జాబితా ఇవ్వాలంటూ సింగ్ లైన్ డిమాండ్ ను భారీగా తెర మీదకు తీసుకొచ్చిన తర్వాత.. 30 రోజుల్లో 36 హత్యల వాదన తెర వెనుక్కి వెళ్లిపోయింది. ఇలా తాను టేకప్ చేసిన ఏ ఇష్యూ అయినా.. అరెరే.. ఎంత దారుణం జరిగిపోయిందన్న భావన కలిగేలా చేయటం.. చివరకు వాటి లోతుల్లోకి వెళ్లి చూస్తే.. అలాంటిదేమీ కనిపించని తీరు జగన్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఏమైనా.. అబద్ధాన్ని నిజమన్నట్లుగా చెప్పటం.. దాన్ని నమ్మేలా వాదనను తెర మీదకు తీసుకురావటంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా. చివరగా ఒక్క మాట.. నిన్న తిరుమల లడ్డూ మీద ప్రెస్ మీట్ పెట్టి.. అయ్యప్ప మాల వేసుకున్న సుబ్బారెడ్డి కంటే గొప్ప భక్తుడు ఎవరుంటారు? అన్నది చూస్తే.. అయ్యప్పకు శ్రీవారికి లింకేమిటి? అన్నది ప్రశ్న. అయ్యప్ప మాట మాదిరే.. గోవింద మాల ఉందన్న విషయం జగన్ కు తెలిసే అవకాశం ఉంటుందంటారా?