ఏపీ సీఎం జగన్… తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి నూతనంగా నిర్మించిన రథాన్ని ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.
40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టా రు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. ఇంకేముంది.. ప్రబుత్వ వర్గాలు దీనిపై భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. అయితే.. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు మరో రూపంలో ప్రచారం చేస్తుండడం గమనార్హం. `అన్నా .. కొత్త రథం నిర్మించారు ఒకే. ఇదంతా ప్రజాధనం. బాగానే ఉంది. కానీ.. పాత రథం దగ్ధం చేసిన వారి మాటేంటి? వారిని పట్టుకుంటారా? లేక.. చేతులు ఎత్తేసినట్టేనా?“ అని కేవలం రెండు గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టయ్యాయి.
అయితే.. దీనిపై అటు మంత్రి చెల్లుబోయిన వేణు కానీ.. ప్రభుత్వ వర్గాలు కానీ.. ఉలుకు పలుకు లేకుండా పోవడం గమనార్హం. తమను అడగొద్దు.. అన్న విధంగా నాయకులు వ్యవహరించారు. ఇక, రథం దగ్ధం ఘటనపై తీవ్రస్థాయిలో రాజకీయం చేసిన బీజేపీ కానీ.. టీడీపీ కానీ.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని కూడా నెటిజన్లు ప్రశ్నించడం గమనార్హం. కొత్త రథం అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వారు తప్పుపట్టకపోయినా.. పాతరథం దగ్ధం విషయంలో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించి.. వదిలేయడం.. మాత్రం ఇక్కడి ప్రజలు జీర్నించుకోలేక పోతున్నారు. విషయం తేల్చాల్సిన ప్రభుత్వం.. కొత్త రథంతో పాత రథం కేసును గాలికి వదిలేసిందని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.