అధికారంలోకి వచ్చిన కొత్తలో అందరూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. చూసేవాళ్లకు కూడా గొప్పగా కనిపిస్తారు. కానీ పాలన సాగించేటపుడే తెలుస్తుంది వారి అసలు సత్తా. అంతకుముందు హీరోలుగా కనిపించిన వాళ్లే పాలనతో జనాన్ని సంతృప్తి పరచలేకపోయినపుడు, అధికారం కోల్పోయినపుడు జీరోలైపోతుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయంతో అధికారం చేపట్టి ఐదేళ్ల పాలనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోతుండడం గమనార్హం.
జగన్ ఏదైనా అంశం మీద ప్రెస్ మీట్ పెట్టినా.. మీడియాతో మాట్లాడినా.. ఆయన కామెంట్లు కామెడీ అయిపోతున్నాయి. సోషల్ మీడియా రెండు మూడు రోజుల పాటు ఆయన్ని ఆటాడేసుకుంటోంది. మీమ్స్ మోతెక్కిపోతున్నాయి.
తాజా ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడిన మాటలు కూడా అలాగే కామెడీగా తయారయ్యాయి. తన పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కని నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. దీని మీద ఆయన మరోసారి పాడిందే పాటరా అన్నట్లు పాత రికార్డే వినిపించారు. అసెంబ్లీలో అధికార పక్షం కాకుండా ఉన్నది తమ పార్టీ మాత్రమే అని.. మరి తన పార్టీని ప్రతిపక్షంగా, తనను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించరని ఆయన వాదించారు.
అసెంబ్లీలో పది శాతం సీట్లు సంపాదించని పార్టీని ప్రతిపక్షంగా గుర్తించరని నిబంధనల్లో ఉన్న విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు. తాను అధికారంలో ఉండగా టీడీపీకి ఓ నాలుగు సీట్లు తీసేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని స్వయంగా వ్యాఖ్యానించి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడ్డం జగన్‌కే చెల్లింది. ఈ వాదన వీగిపోతోందని తెలిసి కూడా ప్రతిసారీ ప్రెస్ మీట్లో అదే మాటలు చెబుతున్నారు జగన్.
అంతే కాక నేషనల్ మీడియా ముందు కూడా ఇదే మాట అన్నారు. ఇదంతా ఒకెత్తయితే అసెంబ్లీకి రాకపోవడాన్ని సమర్థించుకుంటూ.. ఇకపై ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడల్లా.. తమ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి సమావేశాలు జరిగినంత సమయం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందని అన్నారాయన. ఐతే అసెంబ్లీ సమావేశాలు రోజంతా జరుగుతాయి.
మరి అంత సేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూనే ఉంటారా జగన్ అంటూ నెటిజన్లు ఆయన్ని కౌంటర్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లతో జగన్ జనాల్లో మరింత కామెడీ అయిపోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.