ప్రభుత్వానికి ఇప్పటం గ్రామంపై ఆగ్రహం, విశాఖపై వ్యామోహం పెరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చారనే పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఏపీలో రోడ్లను కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
విశాఖలో కుమార్తె భూములు కొంటే తనకేంటని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని, స్థలాలు కొని రేట్లు పెంచాలనే విశాఖపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు ప్రభుత్వ ఆంక్షల కారణంగా భూములు దొరకని సందర్భంలో ఆ ఊరి రైతులు ముందుకొచ్చి 13 ఎకరాల భూమి ఇచ్చారు. సభ నిర్వహణకు సహకరించారు.
అంతేకాదు.. గ్రామంలో చెరువు మట్టిని ఎడాపెడా తవ్వేసి రూ.లక్షలకు అమ్ముకున్న వైసీపీ నాయకులను లెక్కలు అడిగారు. అంతే.. అధికార పార్టీ నేతలు ఆ గ్రామంపై కక్ష గట్టారు. ఆక్రమణల తొలగింపు అంటూ ఎక్స్కవేటర్లతో వచ్చి విశాలమైన రోడ్డు వెంబడి ఉన్న నివాసాలను దౌర్జన్యంగా కూల్చేసి విధ్వంసం సృష్టించారు.
శుక్రవారం ఉదయం జరిగిన ఈ విధ్వంసంపై జనసేనాని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఇప్పటంలో గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడంతో ఈ గ్రామం పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూల్చివేతలు జరిగాయని.. ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఏదేమైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. బుద్ధి చెప్పడం తథ్యమని అన్నారు.