ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ఇసుక పాలసీ…పారదర్శకత అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన జగన్…గుప్పెడు ఇసుక కోసం జనాలు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూసే పరిస్థితి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే సామాన్యుల నుంచి బిల్డర్ ల వరకు అంతా ఇసుక కోసం నానా తిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే ప్రైవేటు భవనాలే కాదు…. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
ఇదే విషయాన్ని తాజాగా పార్లమెంటు సాక్షిగా ఆంధ్రా పరువుపోయే విధంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహయమంత్రి అశ్వినీకుమార్ చౌబే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతోంది అని పార్లమెంట్ లో చౌబే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చెత్త ఇసుక విధానం, కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం వలనే ఎయిమ్స్ నిర్మాణం నత్త నడకన నడుస్తోందని జగన్ ను లోకేష్ దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశానని లోకేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఎయిమ్స్ కట్టకుండా ఉండేందుకు జగన్ కారణమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా, మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి రాష్ట్రం పరువు కాపాడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి, లోకేష్ లేఖపై జగన్ ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.