మార్చిలోపే అన్ని ఎన్నికలు- అసలు కారణాలివేనా
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు ముందు వీటిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్ఈసీతో కలిసి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ముగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నిన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌తో జరిగిన భేటీలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. దీనిపై వెంటనే స్పందించని ఎస్సీసీ నిమ్మగడ్డ.. పరిశీలించి చెబుతానన్నారు. దీంతో మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి
జగన్, నిమ్మగడ్డ మధ్య సయోధ్య
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ముఖాముఖీ పోరు సాగించిన వైసీపీ సర్కారు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికల తొలిదశ ముగిసిన వెంటనే తనను కలిసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌తో ఉల్లాసంగా మాట్లాడిన ఎస్ఈసీ నిమ్మగడ్డ మిగతా ఎన్నికలు ఎలా పూర్తి చేయాలో కూడా చర్చించారు. ఈ సందర్భంగా వచ్చిన ఓ ప్రతిపాదన మారిన పరిస్ధితులకు అద్దం పట్టేలా ఉంది. ముఖ్యంగా ఏడాది కాలంగా నిమ్మగడ్డతో పోరు సాగిస్తున్న ప్రభుత్వ వైఖరిలో మార్పుకు సంకేతంలా కనిపిస్తోంది.
ఒకేసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పోరు సాగుతోంది. ఇది ఈ నెల 21తో ముగిసిపోనుంది. ఆ తర్వాత మున్సిపల్ లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న తనను కలిసిన సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ పంచాయతీ పోరు ఎలా ముగించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో వారు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను ఎస్ఈసీ ముందుంచారు. దీని ప్రకారం పంచాయతీ పోరు తర్వాత ఇక మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రతిపాదించారు.
జగన్ ప్రతిపాదనకు నిమ్మగడ్డ గ్రీన్‌సిగ్నల్
పంచాయతీ పోరు ముగిశాక మిగిలిన స్ధానిక సంస్దల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న జగన్ సర్కార్ ప్రతిపాదనకు ఎస్ఈసీ నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఎస్, డీజీపీతో జరిగిన భేటీలో ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఒకేసారి ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సహకరిస్తే మిగిలిన ఎన్నికలను ఒకేసారి ముగించేయడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనకు ఈ వారంలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి
నిమ్మగడ్డకు రూట్ క్లియర్ చేస్తున్న జగన్
ప్రభుత్వం ప్రతిపాదనను ఎస్ఈసీ ఆమోదిస్తే మార్చిలోగా స్ధానిక ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదన కంటే ముందే నిమ్మగడ్డ మిగిలిన ఎన్నికలను కూడా సాధ్యమైనంత త్వరగా ముగించేయాలన్న తొందర్లోనే ఉన్నారు. మార్చి నెల 31తో నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిపోనుంది. ఆ లోపు స్ధానిక ఎన్నికల ప్రక్రియ ముగించి వెళ్లిపోవాలనేది ఆయన ఆలోచన. దీంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో నిమ్మగడ్డకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. లేకపోతే ఆయన మిగిలిన ఎన్నికల కోసం తన పదవీకాలం పెంపు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వ ప్రతిపాదన ఆమోదిస్తే అలాంటి చిక్కులేవీ లేకుండా మార్చిలోపే తన పని పూర్తి చేసుకుని హాయిగా రిటైర్ కావొచ్చు.
జగన్ సర్కారు తొందర అందుకేనా ?
పంచాయతీ ఎన్నికలు ముగిసిపోగానే మిగిలిన స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వైసీపీ సర్కార్ ఎస్ఈసీ నిమ్మగడ్డ ముందు ఉంచడం వెనుక పలు ఆసక్తి కర కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన మైనది నిమ్మగడ్డను సాధ్యమైనంత త్వరగా సాగనంపడం. లేకపోతే ప్రభుత్వమే ఆయన పదవీకాలం పెంపుకు గ్రీన్‌సిగ్నల్ ఇప్పించాల్సిన పరిస్దితి ఎదురవుతుంది. మరోవైపు ఈ నెలాఖరులో తిరుపతి ఉపఎన్నిక నోటిపికేషన్ విడుదల కానుంది. ఓసారి స్ధానిక పోరు ముగిసిపోతే తిరుపతిపై ప్రభుత్వం, వైసీపీ దృష్టిసారించేందుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. స్ధానిక పోరు సుదీర్ఘంగా కొనసాగితే ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టే అవకాశం ఉండదు. అందుకే మిగిలిన స్ధానిక ఎన్నికలను పూర్తి చేయించేందుకు తొందరపడుతోంది.