ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మహా సిత్రంగా ఉంటుంది. తనకు మించిన కమిట్ మెంట్ మరెవరిలోనూ ఉండదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. మరింతలా మాట్లాడుతున్న ఆయన మాటలు నేతి బీరలో నేతి చందంగానే ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడు మాట్లాడాలనే దానికి ఆయన వద్ద ఉండే లెక్కలో వ్యూహం పక్కాగా ఉంటుంది. ఎప్పుడైతే తాను ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో.. ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారన్న మాట బలంగా వినిపించే వేళలో.. ఆయన నోటి నుంచి ప్రత్యేక హోదా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీస్తుంటారు.
తాజాగా నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రత్యేక హోదా గురించి ఆయన అదే పనిగా ప్రస్తావించారు. ఈ వేదిక మీదనే ఎందుకు ఆయన హోదా ప్రస్తావన తెస్తారంటే.. దానికో లెక్క ఉందన్న మాట వినిపిస్తోంది. రాష్ట్ర డిమాండ్లను బలంగా వినిపించి.. కేంద్రం నుంచి హామీలు పొందే అవకాశం లేనప్పుడు.. ఆ తీవ్రతను పక్కదారి పట్టించేందుకు ప్రత్యేక హోదా అస్త్రాన్ని ఆయన బయటకు తీస్తారు.
తాజాగా జగన్ మాటల్నే చూస్తే.. విభజనతో ఏపీ రాష్ట్రం ఎంతో నష్టపోయినట్లుగా చెప్పిన ఆయన.. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వాలన్నారు.
మౌలిక వసతులు.. ఉద్యోగ అవకాశాల కల్పన.. ఆర్థికంగా పుంజుకోవటంతో పాటు.. పారిశ్రామికంగా వేగంగా ఎదగటం లాంటివి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నిజంగానే.. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు.. అమావాస్యకు.. పౌర్ణానికి ఒకసారి మాట్లాడటం కంటే కూడా.. ఇదే అంశాన్ని తరచూ తన ఎంపీలతో ఎందుకు మాట్లాడించరు.
అంతదాకా ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనూ జగన్ ఎంపీలు ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? అన్నది ప్రశ్న.
మిగిలిన సమయాల్లో మాట్లాడని జగన్.. నీతి ఆయోగ్.. ప్రధానితో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంలో హోదా ప్రస్తావన ఎందుకు తెస్తారంటే.. దానికో లెక్క ఉంది. ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రానికి ఏమేం కావాలో అడగలేని పరిస్థితి. అడిగితే.. మోడీ మాష్టారు ఒప్పుకోరు. అందుకే.. ఆయన ఇప్పటికే రిజెక్టు చేసేసిన హోదా అంశాన్ని ప్రస్తావించటం ద్వారా.. ఒక దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా పరిస్థితి ఉంటుంది.
కేంద్రాన్ని అడిగింది మోడీ ఇవ్వరు. మోడీ ఇవ్వకున్నా.. అడిగిన క్రెడిట్ జగన్ కు దక్కుతుంది. అదేసమయంలో.. మోడీకి ప్రత్యేకంగా ఇవ్వలేదన్న అపవాదు తప్పుతుంది. ఇలా.. మోడీకి ఇబ్బంది లేకుండా.. మోడీ దగ్గర తనకు ఇబ్బంది రాకుండా చూసుకోవటంలో జగన్ మేధస్సు పాదరసం కంటే వేగంగా ఉంటుందని చెప్పక తప్పదు.