ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు లోకేష్ పర్యటన దిగ్విజయంగా జరిగింది. ఈ క్రమంలోనే చివరి రోజు పర్యటన సందర్భంగా న్యూయార్క్ పెట్టుబడిదారులతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ సిద్ధంగా ఉందని, యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని లోకేష్ చెప్పారు. ఏపీలో పలు రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.
బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు యుద్ధప్రాతిపదికన అనుమతులు ఇస్తామని, అందుకోసం ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు పనిచేస్తోందని అన్నారు. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఏపీలో ఉన్నాయని చెప్పారు. మరో ఏడాదిన్నర కాలంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని చెప్పారు. మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ఏఐ నిపుణులు తయారవుతారని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఏపీ ప్రభుత్వం ఉందని లోకేష్ చెప్పారు. ఏపీలో ఒకసారి పర్యటించి స్వయంగా అక్కడి పరిస్థితులను చూడాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సిఇఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & సిఇఓ, యుఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సిఇఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ ( సీనియర్ ఎండి, మెడి మేడిసన్ రివర్ క్యాపిటల్), కెన్ నోవాక్ (ఎండి, అలెక్చ్ బ్రౌన్ & రేమండ్ జేమ్స్), సుసాన్ ఫోర్సింగ్డల్ (ఎండి, ఎలయెన్స్ క్యాపిటల్), డ్యానీ ఫ్రాంక్లిన్ (పార్టనర్, బుల్లీ పల్పిట్ ఇంటర్నేషనల్), థామస్ పొంపిడో (పార్టనర్ & ఫౌండర్, మార్కర్ ఎల్ఎల్ సి), జిమ్ ఊలెరి (ఫౌండింగ్ పార్టనర్, ఊలెరి & కో), మిచైల్ డబ్లియర్ (ఫౌండర్, డబ్లియర్ & కంపెనీ), జెఫ్ న్యూక్ టెర్లీన్ (మేనేజింగ్ పార్టనర్, న్యూ క్యాపిటల్), ధ్రువ్ గోయల్ (సిఇఓ, ఫోర్ లయన్ క్యాపిటల్), నిఖిల్ సిన్హా (సిఇఓ, వన్ వ్యాలీ), సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ ఖేమ్కా, ఎండి వైద్యనాథన్ శివకుమార్, డైరక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.