ముందస్తు ఎన్నికలకు జగన్ రెడీ అవుతున్నారా ? పార్టీలో టాక్ పెరిగిపోతోంది. ఢిల్లీ పర్యటన నుండి వచ్చిన జగన్ ఆలోచనలు చాలా స్పీడుగా మారిపోతున్నట్లు చర్చలు పెరిగిపోతున్నాయి. మూడురోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రులతో భేటీ అయినప్పటికీ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీనే అత్యంత కీలకమని చెప్పాలి. ఎందుకంటే అమిత్ షా తో భేటీ అంటే నరేంద్రమోడీతో భేటీ అయినట్లుగానే అందరు భావిస్తారు కాబట్టి. అలాంటి అమిత్ షా తో జగన్ గంటకుపైగా సమావేశమయ్యారు.
విజయవాడ తిరిగొచ్చిన తర్వాత ముఖ్యనేతలతో సుదీర్ఘమైన భేటీ జరిపారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జగన్ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు నియోజకవర్గ, మండల స్ధాయిలోని నేతలు పాల్గొనబోతున్నారు. పార్టీలోని వివిధ స్ధాయిల్లోని సుమారు 8 వేలమంది నేతలు పాల్గొనబోయే మీటింగ్ చాలా కీలకమనే చెప్పాలి.
ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత జగన్ బాడీ ల్యాంగ్వేజ్ లో మార్పొచ్చిందని నేతలంటున్నారు. అదేమిటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేందుకు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. చంద్రబాబు జైలులో ఉండగానే ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతే టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టవచ్చని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.
ఇదే విషయమై అమిత్ షా తో చర్చించినట్లుగా పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే టీడీపీ అన్నీ విధాలుగా దెబ్బతినటం ఖాయమని అంచనా వేస్తున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపులు, అభ్యర్ధుల ఎంపికలు, ప్రచారం, ఎన్నికల ఖర్చులు ఇలా మొత్తం ప్రతిది టీడీపీలో అస్తవ్యస్ధమైపోతుందని జగన్ అనుకుంటున్నారట. పార్టీవర్గాల టాక్ ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు. జగన్ ఆలోచనలకు గ్రండౌ రియాలిటి విరుద్ధంగా ఉంటే ? చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.