టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని.. ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేశామని.. 3 నెలల కిందట రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడనిని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. తిరగబడరా సామీ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ తనను వదిలేశాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది.
ఆ సినిమా షూటింగ్ టైమ్ లో రాజ్ తరుణ్ కు, మాల్వికి ఏర్పడ్డ పరిచయం రిలేషన్‌షిప్‌గా మారిందని.. వారిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారని లావణ్య చెప్పుకొచ్చారు. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్యతో విడిపోవడానికి మాల్వి కాదని అంటున్నాడు. మాల్వితో తనకు ఫ్రెండ్షిప్ తప్పా మరే రిలేషన్ లేదని తేల్చేశాడు. లావణ్య డ్రగ్స్ కు, చెడు స్నేహాలకు అలవాటు పడటం వల్లే.. 2017లో ఆమెతో రిలేషన్ ముగించానని చెబుతున్నాడు. మొత్తానికి రాజ్ తరుణ్, లావణ్య వ్యవాహంలో మాల్వి మల్హోత్రా హైలెట్ గా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఉత్సాహం చూపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మండి అనే ఊరిలో ఒక పంజాబీ ఫ్యామిలీలో మాల్వి జన్మించింది. తండ్రి సుశీల్ మల్హోత్రా కాగా.. తల్లి బందన మల్హోత్రా. ముంబై యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన మాల్వి.. యాక్టింగ్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. 2017లో ఉడాన్ అనే హిందీ సీరియల్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది.
2018లో విశాల్ మిశ్రా డైరెక్ట్ చేసిన హోటల్ మిలన్ మూవీతో మాల్వి వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న మాల్వి.. 2023లో జోరావర్ డి జాక్వెలిన్ అనే ఓటీటీ ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది అభ్యుహం అనే సినిమాతో మలయాళ ప్రేక్షకులను పలకరించింది. హిందీ, పంజాబీ భాషల్లో అనేక మ్యూజిక్ వీడియోస్‌లో మాల్వి వర్క్ చేసింది. ఇక ఈ ఏడాది తిరగబడరా సామీ చిత్రంతో తెలుగువారికి హాయ్ చెప్పాలనుకుంది. కానీ రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య దెబ్బకు ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండా టాలీవుడ్ లో మాల్వి ట్రెండ్ అవుతోంది.