అది బుల్లి దేశం. మహా అయితే.. తెలంగాణలో ఉన్నంత జనాభా కూడా ఉండరు. సైన్యం పరంగానూ పె ద్ద దేశం కాదు. టెక్నాలజీ పరంగా కూడా వెనుకబాటులోనే ఉంది.కానీ, వైద్య సేవల్లో మాత్రం ముందుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదే ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా. ఈ దేశ జనాభా 3 కోట్ల 89 లక్షలు. విస్తీర్ణంలో మన దేశంలోని ఉత్తరప్రదేశ్ అంత ఉంటుంది. జనాభాలో తెలంగాణ కన్నా తక్కువగానేఉంది. కానీ, దూకుడులో మాత్రం చాలా దూరంగా ఉంది.
అందునా.. భారత్‌పై కాలు దువ్వుతోంది. ఎప్పుడో 2023లో కెనడా రాజధాని ఒట్టావాలో జరిగిన ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యను పదే పదే తవ్వుతూనే ఉంది. అదికూడా తమకు అవకాశం వచ్చినప్పుడు.. అవసరం వచ్చినప్పుడు.. తవ్వేస్తుండడం.. ఆ వెంటనే భారత్‌పై బురద జల్లడం కెనడాకు మామూలైంది. తాజా పరిణామాల నేపథ్యంలోనూ ఇదే జరుగుతోంది. నిజ్జర్‌ను దేశ భక్తుడిగా ప్రకటించారు 52 ఏళ్ల వయసున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.
అంతేకాదు.. ఆయన హత్య వెనుక భారత్ హస్తం ఉందని పదే పదే చెబుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయాన్నే ఆయన సుదీర్ఘ లేఖను కూడా ప్రపంచానికి విడుదల చేశారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత హైకమిషన్ సంజీవ్‌కుమార్ వర్మ, ఇతర దౌత్యాధికారులను అనుమానితుల జాబితాలో చేర్చామని అంటున్నారు. వీరి పాత్ర ఉన్నట్టు తమకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని ట్రూడో చెప్పడం గమనార్హం.
అయితే.. భారత్ మాత్రం నిజ్జర్‌ను ఖలిస్థాన్ తీవ్రవాదిగా ప్రకటించి.. ఆయనపై నిషేధం విధించింది. అనంతర పరిణామాలతో కెనడా 2018 నుంచి(2019లో కెనడా ఎన్నికలు జరిగాయి) భారత్‌తో కయ్యానికి దిగుతూనేఉంది. తాజాగా మరింత వివాదాన్ని రాజేసింది. భారత్ దీటుగా సమాధానం చెప్పింది.. తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిచి.. ఇక్కడ కెనడా దౌత్యవేత్తలను పంపించేస్తోంది.
అసలెందుకీ వివాదం?
ప్రజాస్వామ్యం మంచిదే.. కానీ, రాజకీయాలే మంచిది కాదు. ఈ రాజకీయాలే ఇప్పుడు ట్రూడో విర్రవీగడా నికి, భారత్ పై నిందలు మోపడానికి దారితీస్తున్నాయని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. కెనడాలో సిక్కు సంతతి పౌరులు ఎక్కువ. అంతేకాదు.. నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా ట్రూడో మంత్రివర్గంలోనే పనిచేస్తున్నారు. ఇక, సిక్కులను ప్రభావితం చేసేది నిజ్జర్ ఆశయాలు.. ఆయన అభిమతాలు.
సుమారు 26 శాతం ఓటుబ్యాంకు ఉన్న నేపథ్యంలో వారిని మచ్చిక చేసుకునేందుకు ట్రూడో ఇలా తరచుగా విర్రవీగుతున్నారని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వివాదానికి కారణం కూడా అదేనని, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. 2025-సెప్టెంబరు-అక్టోబరు మధ్య కెనడా ప్రధాన మంత్రి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిక్కులను తనవైపు తిప్పుకొనేందుకు.. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తుల ప్రాపకానికి ట్రూడో ఇలా వ్యవహరిస్తుండడం గమనార్హం.