రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. షార్ట్ కట్ టో ఆర్ఎస్ఎస్. ఈ పేరు వినగానే దేశంలో కొంత మంది ప్రజలు పెదవి విరుస్తుంటారు. ఇక మరి కొంతమంది అయితే ఆర్ఎస్ఎస్ మీద విపరీతమైన ద్వేషం చూపిస్తుంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తుంటారు. ఇక, జాతిపిత మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సే చంపాడన్న కారణంతో కూడా ఆర్ఎస్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు.
ఆ జాబితాలో ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారట. ఆర్ఎస్ఎస్ పై ఆయన విపరీతమైన ద్వేషం చూపించేవారట. ఇదేదో ఆయనంటే గిట్టనివారు చేస్తున్న విష ప్రచారం కాదు. ఈ విషయాన్ని స్వయంగా విజయేంద్ర ప్రసాదే వెల్లడించారు. అయితే, అదంతా గతం అని, నాలుగేళ్ల క్రితం తాను నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తాను తప్పుడు అభిప్రాయంతో ఉన్నానని తెలుసుకున్నానని విజయేంద్ర పసాద్ వెల్లడించాడు.
అంతేకాదు, త్వరలో ఆర్ఎస్ఎస్ పై తాను ఒక సినిమా తీయబోతున్నానని, ఒక వెబ్ సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ రాసిన ఈ‘ది హిందూత్వ పారడమ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
చాలాకాలంగా తనకు ఆర్ఎస్ఎస్ అంటే ద్వేష భావం ఉండేదని ఆయన చెప్పారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ మీద కథ రాసే ఉద్దేశంతో నాగపూర్ కి వెళ్ళానని, అక్కడికి వెళ్ళాక ఆర్ఎస్ఎస్ గురించి తనకు వాస్తవాలు తెలిశాయని, చాలా ఆశ్చర్యకర విషయాలు తెలుసుకున్నానని అన్నారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకుంటే కాశ్మీర్ మనకు దక్కేదే కాదని, సుందర కశ్మీరం పాకిస్తాన్ వశమైపోయేదని అన్నారు.
తాను రాసిన కథను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు చూపించానని, ఆ కథ చదివి ఆయన ఎంతో ఆనందించారని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆనాడు తాను రాసిన కథతోనే ఇప్పుడు సినిమా తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు. అంతేకాదు, ఆ కంటెంట్ తో వెబ్ సిరీస్ కూడా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తన కధలన్నీ తీయటి అవాస్తవాలని, అబద్ధాలని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తాను రాసే కథల్లో కొన్ని మాత్రమే వాస్తవ ఘటనలు ఉంటాయని, చాలా వరకు కల్పితమైనవని, కానీ ప్రతి చిత్రం నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.