మోదీ అని పేరున్న వారిని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడం, ఆ తర్వాత ఆఘమేఘాలపై రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్ సభ స్థానాన్ని ఖాళీగా చూపించడం చకచకా జరిగిపోయాయి. దీంతో, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన బీజేపీ సర్కార్ పై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని ఆయన స్పష్టం చేశారు. అదానీ అక్రమాలను తాను బట్టబయలు చేస్తున్నానని, అందుకూ తన ప్రసంగానికి మోదీ భయపడి తనపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. మోదీ కళ్లలో భయం కనిపించిందని, అందుకే పార్లమెంట్లో తనను మాట్లాడనివ్వకుండా అనర్హత వేటు వేశారని ఆరోపించారు.
తన పేరు సావర్కర్ కాదని, తాను గాంధీనని, ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా ప్రకటించడంపై తాను ఆందోళన చెందడం లేదని, నిజానికి తాను ఉత్సాహంగా ఉన్నానని రాహుల్ అన్నారు. భారతదేశ వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తులు జోక్యం చేసుకోవాలని తాను వ్యాఖ్యానించినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాహుల్ ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సభలో వివరణ ఇచ్చేందుకు అవకాశం కోరానని, కానీ తనకు అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.