టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మూడు రోజుల జిల్లాల పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక, చంద్రబాబు పర్యటన తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ నింపింది. అడుగడుగునా ప్రజలతో మమేకమైన చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ పై జనానికి ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బట్టబయలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన 3 రోజుల జిల్లాల పర్యటనపై చంద్రబాబు స్పందించారు.
బాదుడే బాదుడు కార్యక్రమాల్లో భాగంగా ఈ పర్యటన అద్భుతంగా కొనసాగిందని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని, ఏడు జిల్లాల్లో లక్షల మందికి చేరువగా పర్యటించిన తనకు వారి గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. అధిక పన్నులు, అధిక ధరల భారం తమపై పడిందని వారు తన దగ్గర తీవ్ర ఆవేదన చెందారని అన్నారు. వారి ఆవేదన ప్రభుత్వ వ్యతిరేకతను చాటిందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు.
ప్రజల్లో టీడీపీపై కనిపిస్తున్న ఆసక్తి రాబోయే మార్పునకు నాంది అని అన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
ఒక్క మాటలో చెప్పాలంటే. ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందని అన్నారు. తన పర్యటనను విజయవంతం చేసిన కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగేందుకు సహకరించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు.