సీఎం జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న పెనమలూరులో బ్రిడ్జిపై చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం సక్సెస్ అయింది. టిడిపి నేత బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అదే ఊపులో రాష్ట్రంలోని పలుచోట్ల ఇదేం ఖర్మ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.
ఈ క్రమంలోనే రేపు రాష్ట్ర స్థాయిలో ఇదేం ఖర్మ ఆక్వా రైతాంగానికి పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నామని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా సంఘాల నేతలు, ఆక్వా రైతులు ఈ సదస్సులో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, టిడిపి కీలక నేతలంతా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారని వెల్లడించారు.
ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని అచ్చెన్న అన్నారు. చంద్రబాబు హయాంలో ఆక్వా రంగంలో ఏపీ నెం.1గా ఉండేదని, ఇప్పుడు ఏపీలో ఆక్వారంగం పతనావస్థకు చేరుకుందని ఆరోపించారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇస్తామని జగన్ చెప్పారని, కానీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. విద్యుత్ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్ నిండా ముంచేశారని అచ్చెన్న విమర్శించారు.
మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రకరకాల నిబంధనలతో సబ్సిడీలు ఎత్తివేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. 5000 కోట్ల జే టాక్స్ తో ఆక్వా రంగాన్ని జగన్ నాశనం చేశారని ఆరోపించారు.