ఏపీ లో పెన్షన్ లబ్ధిదారులకు టెన్షన్ మొదలైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపు పై సంతకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ దారులకు రూ.4000 మరియు గత మూడు నెలల పెంపు రూ. 3000 కలిపి మొత్తం రూ. 7000 ను జూలై 1వ తారీకు ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించబోతున్నారు.
ఇందంతా బాగానే ఉన్నా పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారు..? అనే దానిపై లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈసీ వాలంటీర్లను విధులకు దూరం చేసింది. దాంతో గత మూడు నెలల నుంచి రెండు విధాలుగా పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ అందించగా.. మిగిలిన వారందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో వృద్ధులు బ్యాంకుల్లో సొమ్మును విత్ డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇక నెలాఖరకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. మునుపటిలా ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలి అంటే వాలంటీర్లు అవసరం. అయితే ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఇంకా వారి సంగతేంటో తేలలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు..? బాబు ప్లాన్ ఏంటి..? అనేది ఆసక్తికరంగా మారింది. పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో ఉన్న వాలంటీర్లతోనే పెన్షన్ చేతికి అందిస్తారనే వాదన బలంగా వినపడుతోంది.