వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, అటువంటి వారిని వదిలిపెట్టబోమని వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా కేసులు పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన పోలీసు అధికారులు రిటైర్ అయినా..పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్నా….ఆఖరికి సప్తసముద్రాల అవతల ఉన్నా సరే పట్టుకొస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
తన తల్లి, చెల్లి గురించి వైసీపీ కార్యకర్తలే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ కు పౌరుషం రాలేదా? అని అనిత ప్రశ్నించారు.
ఆ మాటలతో జగన్ రక్తం మరగకపోయినా…తమ రక్తం మాత్రం మరుగుతోందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టు వాగే కార్యకర్తలు సప్తసముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అనిత వార్నింగ్ ఇచ్చారు.
“నాడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమందిపై కేసులు పెట్టారు. చింతకాయల విజయ్, రంగనాయకమ్మ, గౌతు శిరీషలను ఇబ్బందిపెట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అంటే ఏమిటో జగన్ కు తెలుసా? అమరావతి మహిళా రైతుల గురించి నీచాతినీచంగా మాట్లాడారు. జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు.
వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి దారుణమైన పోస్టులు పెట్టాడు. విజయమ్మ, షర్మిలపై ఘోరమైన పోస్టులు పెట్టడం మనం చూశాం. వైసీపీ కార్యకర్తలు పెట్టే కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది” అని అనిత దుయ్యబట్టారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు ఐదు నెలల్లో ఘోరాలు జరిగినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు.