ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు జరగడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడి ఏకగ్రీవాలను ప్రకటించవద్దంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.
అయితే, ఈ వ్యవహారంలోనే నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ చెప్పినట్లు ఏకగ్రీవాలు ప్రకటించన అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు ప్రకటించవచ్చంటూ ఎస్ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పుంగనూరు, మాచర్ల, తంబళ్ళపల్లి నియోజకవర్గాలలో పంచాయతీల ఏకగ్రీవాలపై విచారణ జరపాలంటూ పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అనీషారెడ్డి, టీడీపీ మాజీ ఎ మ్మెల్యే శంకర్, న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఏకగ్రీవాలపై విచారణ జరిపి రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీకి కోర్టు ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతోపాటు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడినా…వాటిని నిలువరించడంలో ఎస్ఈసీ, జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని అనీషా రెడ్డి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… ఆ పంచాయతీల్లో ఫిర్యాదులు ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు, మాచర్ల, తంబళ్ళపల్లి, పుంగనూరులో జరిగిన ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.