ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు..అందుకే దుల్హన్ పథకాన్ని ఆపేశామంటూ ఏపీ సర్కార్ చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకాన్ని జగన్ సర్కార్ నిలిపివేయడాన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో సవాల్ చేశారు. షిబ్లి దాఖలు చేసిన పిటిషన్పై నేడు రెండో సారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దుల్హన్ పథకాన్ని ఆపేయడానికి గల కారణాలేమిటో వివరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. అయితే, ఆ వివరణ అందించేందుకు 4 వారాల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు మన్నించింద. ఈ పిటిషన్ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కానీ, వివరణనిచ్చేందుకు ఇదే చివరి అవకాశమని, తక్షణమే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని జగన్ ప్రతిపక్ష నేతగా హామీనిచ్చారు. 2019లో కేబినెట్లో దానికి అనుగుణంగా తీర్మానం కూడా చేశారు. 2020 ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి నుంచి పథకం అమల్లోకి తెస్తామని ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత మరో ఏడాది సమయమివ్వాలని, గొప్పగా సాయం అందిస్తామని జగన్ ప్రకటించారు. కానీ, తాజాగా ఈ ఏడాది అసలు పథకమే లేదని, డబ్బులు లేవని రిక్త హస్తాలు చూపించారు.
అయితే, దుల్హన్ పథకం కింద అందుతున్న రూ. 25 వేల సాయాన్ని 2015లో సీఎంగా ఉన్న చంద్రబాబు రూ. 50 వేలకు పెంచారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వివాహాల పథకాలన్నీ ఒకే వేదిక మీదకు తేవాలన్న ఆలోచనతో 2018లో దుల్హన్ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. ఐదేళ్లకాలంలో దాదాపుగా 50 వేల మందికిపైగా ముస్లింలకు చంద్రబాబు పెళ్లి కానుక ద్వారా సాయం చేశారు. జగన్ మాత్రం అసలు పథకాన్ని ఎత్తివేసి తనవి ఉత్త మాటలని నిరూపించారు.
Comments 1