టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల పుకార్లకు శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. కానీ, వీరిద్దరూ తమ విడాకుల గురించి అఫీషియల్ గా ప్రకటన చేయకముందే ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. సమంత -నాగచైతన్యల విడాకులకు అమె కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కరే కారణమంటూ కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రచారం చేశారు. దీంంతో, తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తించిన 3 యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో సమంత కేసు వేసింది.
సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత తరఫు న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఆ యూట్యూబ్ చానెల్స్ వాస్తవదూరమైన కథనాలు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించాయని సమంత తన పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం నాడు ఈ పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరిగాయి.
ఈ క్రమంలోనే తాజాగా సమంతకు ఊరట కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమంత వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. సమంతకు సంబంధించిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని ఆ మూడు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.