మెరిసే అందం ఉంటే సరిపోదు. దానికి మించి మరేదో కావాల్సిందే. ఆ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే గ్లామర్ ప్రపంచంలో అంతలా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవచ్చు. సినిమా ప్రపంచంలో అవకాశాలు రావటమే చాలా కష్టం.
వచ్చిన అవకాశాన్ని అసరాగా చేసుకొని జాగ్రత్తగా మెట్లు ఎక్కటం అందరికి చేతనయ్యే పని కాదు. ఈ విషయంలో చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఫెయిల్ అవుతుంటారు. ఆ కోవలోకే వస్తారు నీతూ చంద్ర.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి సినిమాలో కమలినీ ముఖర్జీతో పాటు మరో హీరోయిన్ గా నటించిన ఆమె.. ఆ సినిమాలో మెరిసిపోయారు. గోదావరి అందాలతో పోటీ పడే ఆమె అందం ఉన్నప్పటికీ.. సినిమాలో స్వార్థపరురాలైన మరదలి పాత్ర ఆమెకు మైనస్ అయ్యింది. అయితే.. ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అయినప్పటికీ.. అగ్ర హీరోలతో ఆడి పాడే అవకాశాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
తర్వాతి కాలంలో పలు సినిమాలు చేసినా.. పెద్దగా రిజిస్టర్ కాలేదు. బ్రేక్ కూడా రాలేదు. దీనికి కారణం ఆమె అటిట్యూడ్ అని కొందరు అంటే.. మరికొందరు ఆమెకు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీకపోవటమే అన్న మాట వినిపించేది. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాన్ని వెల్లడించారు. కెరీర్ లో తాను బెస్టు ఇచ్చినప్పటికీ తాను సక్సెస్ కాలేదన్న వేదన ఆమె మాటల్లో వినిపించింది.
తనది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ అని చెబుతూ.. ‘పదమూడు మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్ గా నటించా. పెద్ద సినిమాల్లో నటించిన నటిని. అలాంటి నాకు ఈ రోజు పని లేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త నాకు నెలకు రూ.25 లక్షలు ఇస్తా.. జీతం తీసుకొని భార్యగా ఉండాలని కోరాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. పని లేదు. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నాననిపించింది’ అని చెప్పుకొచ్చారు.
ఇంతకూ నీతూచంద్రను నెల నెలా జీతం మాదిరి డబ్బులు తీసుకుంటూ భార్యగా ఉండాలని ఆఫర్ చేసిన పెద్ద మనిషి ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. అందం.. అభినయం.. స్వతంత్ర భావాలున్న ఒక నటికి ఇంతకు మించిన చేదు అనుభవం ఇంకేం ఉంటుంది?