42 ఏళ్ల వయసున్న టిక్ టాక్ స్టార్ కమ్ బీజేపీ నేత సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మరణించినట్లుగా వచ్చిన వార్తల్ని చూసినోళ్లంతా షాక్ తిన్నారు. మాయదారి కరోనా తర్వాత.. మధ్యవయస్కులు పుటుక్కున మరణిస్తున్న వేళ.. సోనాలి విషయంలోనూ అలానే జరిగిందా? అన్న భావన కలిగింది. అయితే.. ఆమె మరణంలో కుట్ర కోణం ఉందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించటంతో అందరూ ఉలిక్కిపడిన పరిస్థితి.
గోవాకు వచ్చిన సోనాలి ఫోగట్.. అనూహ్యంగా మరణించిన వైనంపై పలు సందేహాలు వ్యక్తమైన వేళ.. ఎట్టకేలకు గోవా పోలీసులు రంగంలోకి దిగటం.. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం పంపారు. సోనాలీ డెడ్ బాడీని గోవా మెడికల్ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్టు షాకింగ్ గా మారింది. ఎందుకుంటే.. ఆ నివేదికలో ఆమె శరీరం మీద మొద్దుబారిన గాయాలు ఉన్నట్లుగా వెల్లడైంది. అంటే.. బతికి ఉన్న సమయంలో ఆమె నరకయాతన లాంటి హింసకు గురైనట్లుగా చెప్పాలి.
దీంతో.. గోవా పోలీసులు ఆమె మరణాన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేయటంతో పాటు.. ఈ కేసులో అనుమానితులుగా సోనాలీకి సన్నిహితంగా ఉండే ఆమె ఇద్దరు సహచరులపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హర్యానాలోని హిసార్ కు చెందిన టిక్ టాక్ స్టార్ గా సుపరిచితులురాలు సోనాలి ఫోగట్ ఈ నెల 23న హఠాన్మరణం చెందటం పలువురిని షాక్ కు గురి చేసింది.
ఆమె మరణం గురించి తెలిసిన వెంటనే.. ఆమె కుటుంబ సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె డెడ్ బాడీని గోవాలో కాకుండా ఢిల్లీ కానీ జైపూర్ లో కానీ పోస్టుమార్టం చేయాలని ఆమె సోదరులు డిమాండ్ చేశారు.
తన సోదరి అనారోగ్యంతో మరణించలేదని.. ఆమెను హత్య చేసినట్లుగా ఆయన ఆరోపించారు. ఈ నెల 22న గోవాకు వచ్చిన ఆమె.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరటం.. ఆపై మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె మరణ వార్త విన్నంతనే హుటాహుటిన గోవాకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె మరణంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
ఆమె సహచరులుగా చెప్పే సుధీర్ సగ్వాన్, సుఖ్ విందర్ వాసీలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. వారితో తనకు ప్రమాదం పొంచి ఉందని ఆమె మరణించటానికి రోజు ముందు తమకు చెప్పినట్లుగా సోనానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా తాజాగా వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు సంచలనంగా మారింది. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.