గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఈ మధ్యన నిర్వహించిన ఎన్నికల సంగతి తెలిసిందే. 99 మంది కార్పొరేటర్ల అధిక్యతతో బరిలోకి దిగిన తెలంగాణ అధికారపక్షానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎంతలా షాకిచ్చారో తెలిసిందే. ఎన్నికల ముగిసిన తర్వాత.. కొత్తగా కార్పొరేటర్లు ఎన్నికైనా.. ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీంతో.. ఈ ఎన్నికల్లో తమ అధిక్యతను స్పష్టంగా ప్రదర్శించిన బీజేపీ.. తమ కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించాలని కోరుతూ.. ఇటీవల కాలంలో తరచూ ఆందోళనలు.. నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రూల్ పొజిషన్ ప్రకారం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించే వీల్లేదు. ఆ విషయం బీజేపీకి తెలీదా? అంటే తెలుసు. కానీ.. రాజకీయ రగడకు అవకాశం ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు వదిలిపెడతారు. అందునా.. బీజేపీ అస్సలు వదిలిపెట్టదు కదా. ఈ కారణంతోనే.. తమకు అవకాశం లేదని తెలిసినా.. గెలిచిన కార్పొరేటర్లు ఊరికే కూర్చోవాలా? ప్రజాసేవ చేసేదెప్పుడు అంటూ హడావుడి చేసేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం బల్దియా ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వేషన్లు.. పార్టీల వారీగా కార్పొరేటర్ల వివరాల్ని వెల్లడించారు. దీంతో..గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ పూర్తై.. విజేతల వివరాలు తెలిసిన ఐదు వారాల అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
బల్దియాలో ఇంతకు ముందెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. వాస్తవానికి.. గ్రేటర్ వరకు వచ్చేసరికి.. పదవీ కాలం పూర్తి అయిన తర్వాత ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించేవారు. అందుకు భిన్నంగా.. ఈసారి మాత్రం కేసీఆర్ సర్కారు గ్రేటర్ ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించింది. నిబంధనల ప్రకారం గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం తమ పూర్తి పదవీ కాలం ముగిసే వరకు కొత్తగా ఎన్నికైన వారికి అవకాశం లేదు. ఈ కారణంతోనే ఎన్నికల కమిషన్ గెజిట్ ను విడుదల చేయలేదు.
తాజాగా విడుదలైన గెజిట్ ప్రకారం ఫిబ్రవరి 15 లోపు కొత్త పాలక మండలి సభ్యుల ప్రమాణం.. మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకేరోజు సభ్యుల ప్రమాణస్వీకారం.. అదే రోజున మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేయనున్నారు.