జగన్ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు రావడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి ని గతంలో ఎవరు సప్లయ్ చేసేవారు? జగన్ వచ్చిన తర్వాత వారు ఎందుకు సప్లై చేయడం లేదు? అన్న చర్చ మొదలైంది. తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిని ఎన్నో దశాబ్దాలుగా కర్ణాటకకు చెందిన నందిని డైరీ సరఫరా చేస్తోంది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత అతి తక్కువ ధరకు నెయ్యి అందించాలని టెండర్లు వేశారు. తమకు గిట్టుబాటు కాకపోవడంతో నందిని డెయిరీ టెండర్ వేయలేదు.
ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ కు చెందిన రెండు సంస్థలకు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చేసింది అప్పటి జగన్ సర్కార్. ఆ సంస్థలు బీఫ్ ఎక్స్ పోర్టింగ్ లో దిట్ట. కానీ, అవి నెయ్యి ఏ విధంగా తయారు చేస్తాయి, నాణ్యత ఎలా ఉంటుంది అన్నది పరీక్షించకుండానే కాంట్రాక్ట్ కట్టబెట్టారు జగన్. ఇక, నెయ్యి క్వాలిటీ చెకింగ్ కోసం తిరుమలలో ల్యాబ్ పెట్టామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 2024 జూన్ నెలలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెయ్యి టెస్ట్ లో నెయ్యి నాణ్యత లోపించిందని టీటీడీ ఈవో శ్యామల రావు గుర్తించారు.
దీంతో, పాత సంస్థల కాంట్రాక్ట్ లు రద్దు చేసి నందిని డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు, నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గతంలోని సంస్థలను శ్యామల రావు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇలా నెయ్యి సప్లయర్ ను మార్చడం మొదలు నెయ్యి క్వాలిటీ సరిగా చెక్ చేయకపోవడం వరకు అన్ని లోపాలకు కారణం జగన్ సర్కార్ అని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.