ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ల నేపథ్యంలో విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. బెజవాడలోని పలు ప్రాంతాలలో వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేలాదిమంది నిరాశ్రయులు కాగా, వందలాది ఇల్లు నీట మునిగాయి. ఈ క్రమంలోనే వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి. ఆ క్రమంలోనే తాజాగా వరద నష్టం గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వరదల వల్ల 32 మంది మృతి చెందారని, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారని వెల్లడించింది. 1.69 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందని, 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రానికి రూ.6,800 కోట్లు నష్టం జరిగిందని అంచనా వేసింది. రోడ్లు భవనాల శాఖకు రూ.2,164.5 కోట్లు, జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్లు నష్టం జరిగినట్టు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది. ఈ ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.