ఏపీ రాజధాని అమరావతి పనులు ఇంక వడివడిగా సాగనున్నాయి. గత వైసిపి ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడంతో రాజధాని మూలన పడింది. మూడు రాజధానులు అన్నప్పటికీ ఎట్లాంటి ప్రయోజ నం లేకుండా పోయింది. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి అధినేత చంద్రబాబు వచ్చీ రావ డంతోనే అమరావతిపై దృష్టి పెట్టారు. తొలి వారంలోనే ఆయన అమరావతిలో పర్యటించి పరిస్థితులు అధ్యయనం చేశారు. అనంతరం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ నిపుణులను తీసుకువచ్చి అమరావతిలో నిర్మాణాలు పరిస్థితిని అంచనా వేయించే పనిని ప్రారంభించారు.
ప్రస్తుతం ఇది జరుగుతోంది. మరోవైపు అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం మరోవైపు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పురూపంలో నిధులు సమీకరించడం ద్వారా రాజధాని నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. దీనిలో తొలి దశ కింద 30 వేల కోట్ల రూపాయలను సమీకరించి నిర్మాణాలను ప్రారంభించడం ద్వారా అమరావతికి ఒక రూపురేఖలు తీసుకురావాలని భావిస్తుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు ఏదో ఒక రూపంలో సాయం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచ బ్యాంకు ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గడిచిన రెండు రోజులుగా అమరావతిలో పర్యటించారు. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఇక్కడ రైతులతో కూడా మాట్లాడారు.
అదేవిధంగా నవ నగరాల ప్లాన్ ను కూడా పరిశీలించారు. మొత్తంగా ఆర్థిక రూపంలో సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధంగానే ఉందని అర్థమైంది. దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. ఫలితంగా అమరావతి ప్రాజెక్టు వచ్చే ఆరు మాసాల్లో పట్టాలెక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా అక్కడ జోష్ పెంచేందుకు తరచుగా చంద్రబాబు పర్యటించనున్నట్టు సమాచారం.