సినిమా ఎలా ఉన్నా కూడా ఆర్థిక ప్రజాస్వామ్యం అన్న మాట బాగుంది. సర్కారు వారి పాటకు సంబంధించి వినపడుతున్న మాటల్లో, వినిపించి గుర్తింపునకు నోచుకున్న మాటల్లో ఇదొక్కటే ఎంతో బాగుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్-లో సహా దేశ వ్యాప్తంగా ఉద్దేశ పూర్వక ఎగవేత దారులను ఉద్దేశించి తీసిన సినిమాలో .. ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి చెప్పారు డైరెక్టర్ పరశురాం. ఆ విధంగా ఈ సినిమాలో ఇదొక్కటే ఇంట్రస్టింగ్ పాయింట్ … ఒక్కసారి చూద్దాం ఆ వివరం.
తప్పులు ఎవ్వరివి అయినా సరే గుర్తించాల్సిందే ! గొంతెత్తి మాట్లాడాల్సిందే ! దేశంలో ఇప్పటికే ఉద్దేశ పూర్వక ఎగవేతదారులు (రుణాలకు సంబంధించి) ఎక్కువగానే ఉన్నారు. ప్రజల కష్టాన్ని దోచుకుని వారు పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్నారు. బ్యాంకులలో వేలకు వేలు రుణాలు కేవలం అధికారం అడ్డుపెట్టుకునే పిండేస్తున్నారు. ఈ విధానాన్ని నిరసించడం కానీ అడ్డు కోవడం కానీ ఎవ్వరూ చేయడమే లేదు. మరోవైపు ప్రభుత్వాలే కొన్ని ఉద్దేశ పూర్వక ఎగవేతదారులుగా ఉన్నాయి. మొన్నటికి మొన్న శ్రీలంక కూడా తాము తీసుకున్న విదేశీ రుణాలు చెల్లించేదే లేదని విల్ ఫుల్ డిఫాల్టర్ గా నమోదు అయింది.
ఇదే విధంగా మనదేశంలో చాలా మందిని మన నేతలే విల్ ఫుల్ డిఫాల్టర్లుగా తయారు చేస్తున్నాయి. ఇదొక నేరం. వాస్తవానికి సంక్షేమ పథకాలన్నీ ఆర్థిక ప్రజా స్వామ్యాన్ని వెక్కిరించేవే ! సంక్షోభాలను మోసుకొచ్చేవే ! ఆ రోజు చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కావొచ్చు లేదా టిడ్కో ఇళ్లకు ఉన్న వాయిదాలను మేం రద్దు చేస్తాం అని జగన్ చెప్పిన తీరు కావొచ్చు..ఇవన్నీ కూడా కేవలం ఉద్దేశ పూర్వక ఎగవేత దారులను పెంచి పోషించేవే ! నిజంగా ఆర్థిక స్థోమత ఉండి కూడా రుణాలు కట్టకుండా గ్రామాల్లో ఉన్న బడా రైతులు ఎందరో ! మరి ! వారికి ఎలా రుణ మాఫీని వర్తింపజేస్తారు. రూపాయిని దోచుకుని దాచుకోవడం ఎంత వరకూ సమంజసం.
అంటే పథకాలు అన్నీ కూడా ముఖ్యంగా రుణాల రద్దు అన్నవి వద్దే వద్దు అని బ్యాంకులు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా కూడా రాష్ట్రాల పాలనాధీశులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. మరోవైపు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న వారు కూడా వీరికేం తీసిపోరు. కనుక లోన్ రికవరీ అన్నది బ్యాంకులకొక తలనొప్పిగానే ఉంది. ఇవాళ విడుదలయిన మహేశ్ నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఈ పాయింట్ చెప్పారు. బాగుంది.ఆ ఒక్క పాయింట్ గురించి ఇంకొంత కూడా తీయొచ్చు, రాయొచ్చు కూడా !