పెగాసస్ వివాదంపై వైసీపీ నేతలు గందరగోళం రేపుతోన్న సంగతి తెలిసిందే. పెగాసస్ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెగాసస్ విషయంలో అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ వ్యవహారంలో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా మీడియా ముందుకు వచ్చి ఆ వ్యవహారంపై వివరణనిచ్చారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నంత వరకు పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనలేదని, ఇది ఫైనల్ అని ఏబీ క్లారిటీనిచ్చారు. తప్పు చేయాలంటే భయపతానని, పెగాసస్ వివాదంలోకి తనను లాగుతారని తెలిస్తే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేయడం సరికాదని వాపోయారు.
జీవితాంతం దుష్టుల నుంచి తాను ప్రజలను రక్షిస్తే, ఇప్పుడు తనకే రక్షణలేకుండా పోయిందని ఏబీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని, కానీ, ప్రైవేట్ వ్యక్తుల ఆరోపణలను తిప్పికొట్టడానికే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. తాను ఏపీ మట్టిలోనే పుట్టానని భావోద్వేగంతో అన్నారు. తనపై విచారణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరానని, తన సస్పెన్షన్ విషయం కోర్టు వద్ద పెండింగులో ఉందన్నారు. తనను సస్పెండ్ చేసిన నాటి నుంచి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయడానికి ప్రభుత్వ అనుమతి కోరానని అన్నారు. ఆరు పేజీల అబద్దాలను సీపీఆర్వో మీడియాకు విడుదల చేశారని, ఆ ఆరు పేజీల్లోని అంశాలు తనపై దాఖలు చేసిన ఛార్జ్ మెమోలో లేవని చెప్పారు. రూ.25 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేశారని, కానీ ఛార్జిషీట్లో దానిని ఎందుకు ప్రస్తావించ లేదని ప్రశ్నించారు. తనపై వేసిన మూడు అభియోగాల్లో అవినీతికి సంబంధించిన అంశమే లేదని, తనను ఏకంగా దేశద్రోహి అని ప్రచారం చేశారని, తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని బాధపడ్డారు. పెగాసెస్ నేపథ్యంలో తనపై చేస్తోన్న ఆరోపణల్లోనూ ఎలాంటి వాస్తవం ఉండదని చెప్పారు.