అమెరికాలో జరిగిన TANA 23వ మహా సభలకు భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన రాజకీయాలు, పోకడలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత దేశ రాజకీయాలలో వికృత ఘటనలు, పోకడలు ఎక్కువయ్యాయని, రాజకీయ పార్టీల నిర్వహణ ప్రైవేట్ సంస్థల కనుసన్నల్లో జరుగుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తులు పార్టీలను నడపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నేటి రాజకీయాల్లో విలువలు, ప్రమాణాలు, నైతికత లేవని, రాజకీయాల కోసం స్త్రీలను కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతతో పాటు మేధావులు కూడా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నీతివంతులు రాజకీయాల్లోకి రాకుంటే నీతిలేని వారే రాజ్యమేలుతారని చెప్పారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. సైకో తరహా విధ్వంసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆ సైకోలే జాత్యహంకారపు, కులాహంకారపు వ్యాఖ్యలు చేస్తారని, వాటిని వ్యాప్తిలోకి తెస్తారని అన్నారు. సైకోలే విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారని మండిపడ్డారు. ‘‘నేను.. నా కుటుంబం’’ తప్ప వారికింకేమీ పట్టవని, కానీ, చేసేదంతా సమాజం కోసమే అని నమ్మబలుకుతారని వ్యాఖ్యానించారు.
చదువుకున్న వారు కూడా ఈ తరహా సైకో ప్రచారాన్ని నమ్మి వినాశానికి ఊతమిస్తున్నారని, రాబోయే తరాలు అటువంటి వారిని క్షమించవని అన్నారు. ఃచరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హితవు పలికారు. ఇంగ్లీషు భాష సర్వరోగ నివారిణి అని నమ్మించే ప్రయత్నాలు పదే పదే జరుగుతూనే ఉంటాయని ఏపీలో ఇంగ్లిష్ మీడియం విద్యపై పరోక్షంగా చురకలంటించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు.
ఆనాడు ఆయన టెక్నాలజీని ప్రోత్సహించడం వల్లే అమెరికాలో ఆంధ్రులకు అవకాశాలు విపరీతంగా పెరిగాయని అన్నారు.ఇంగ్లిష్ మీడియంపై, ప్రైవేటు సంస్థలంటూ పరోక్షంగా ఐప్యాక్ పై తాజాగా మాజీ సీజీఐ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ న్ టార్గెట్ చేసినట్లున్నాయని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.