ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు.. తాజాగా నిజమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ వేదికగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చసాగినట్టు జాతీయ మీడియా సైతం వెల్లడించింది. తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదేసమ యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ సీఎం జగన్ చర్చలు జరిపారు. అయితే.. నిర్మలాసీతారామన్‌తో చర్చల పరిస్థితి ఎన్నా.. ప్రధాని, హోం మంత్రితో చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
వాస్తవానికి.. ప్రధాని నరేంద్ర మోడీతో గతంలోనూజగన్ భేటీ అయ్యారు. అయితే, ఆ సమయంలో ఆయన కేటాయించిన సమయం కేవలం 20 నుంచి 40 నిమిషాల మధ్యలోనే. అది కూడా కర్నాటక ఎన్నికల సమయంలో 40 నిమిషాలు గరిష్ఠంగా మోడీ జగన్‌తో భేటీ అయ్యారు. అయితే..తాజా చర్చలు మాత్రం ఇరువురు మధ్య దాదాపు గంటా 40 నిమిషాల సేపు సాగినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇంత సేపు ఆయనతో జరిగిన చర్చల్లో ప్రధానంగా ముందస్తు ఎన్నికలే కీలక అంశమని జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే నవంబరులో ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదేసమయంలో ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించేలా చూడాలని సీఎంజగన్ ప్రధానిని కోరినట్టు సమాచారం. నిజానికి వచ్చే నవంబరు నాటికి మరో నాలుగు మాసాల పాలనా గడువు సీఎం జగన్‌కు వుంటుంది. అయినప్పటికీ… ఆ సమయాన్ని కూడా వదులుకుని ఆయన ముందస్తుకు వెళ్తుండడం.. దీనిపై కేంద్ర పెద్దలతో ఆయన మంతనాలు చేయడం సంచలనమనే చెప్పాలి. తొలుత కేంద్ర మంత్రి అమిత్ షా వద్దే ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్టు సమాచారం. అయితే.. ఆయన సూచనల మేరకు. నేరుగా ప్రధాని వద్దే సీఎం జగన్ ముందస్తు ప్రతిపాదనను వివరించారని తెలిసింది.
కారణాలపై లోతుగా ఆరా!
ఇక, ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ వెళ్తానని చెప్పగానే.. ప్రధాని నరేంద్ర మోడీ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచా రం. అయితే..దీనికి గల కారణాలను కూడా ఆయన లోతుగానే ఆరా తీశారని అంటున్నారు. అయితే.. ఈ క్రమంలో ఆర్థిక సమ స్యలను.. రాజకీయ పార్టీల పొత్తులను ప్రస్తావించకుండా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మేలు జరగాలంటే..(ఉభయ కుశలోపరిగా) ముందస్తుకు వెళ్లడం మంచిదని జగన్ సూచించినట్టు తెలిసింది. అంటే.. మోడీకి మేలు జరిగేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది జాతీయ మీడియా వర్గాల అభిప్రాయం. దీంతో మరోసారి దీనిపై చర్చిద్దామంటూ.. ప్రధాని ముక్తాయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో మరో నెలలోనే జగన్ ఢిల్లీ టూర్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.