2024 ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గతంలో ఏపీకి రాజధానిగా చంద్రబాబు అమరావతిని ప్రకటించారు. అయితే వైకాపా హయాంలో అమరావతి ఊసే లేకుండా పోయింది.
ఇప్పుడు మళ్లీ అధికారం చంద్రబాబుకు రావడంతో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధానిని నిర్మిద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనలో కొత్త ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఇక ఇదే తరుణంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన అంబుల వైష్ణవి అనే మెడికల్ స్టూడెంట్ తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరాను అమ్మి రూ. 25 లక్షలు రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుకు అందజేసింది.
ఇక తాజాగా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు డ్వాక్రా, మెప్మా సంఘాల నేతలు భారీ విరాళం అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు రూ. 4.5 కోట్లు విరాళాన్ని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబుకి అందజేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇన్నాళ్లూ అవమానం పాలైన ఏపీ ఇప్పుడు చంద్రబాబు రాకతో తలెత్తుకుంటోందని.. ఆయన కృషితోనే అమరావతి పూర్తవుతుందని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు కొనియాడారు.