“ఇలా అయితే.. ప్రభుత్వ కార్యాలయాలను తీసుకుని మీరు విశాఖకు వెళ్లలేరు“ అని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ భవనాలు కూడాఅన్వేషించాలని కోరుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కొన్నాళ్ల కిందట జీవో కూడా ఇచ్చారు. దీంతో అధికారులు విశాఖలో భవనాలను కూడా రెడీ చేశారు.
కానీ, ఇంతలోనే దీనిపై కొందరు రైతులు, ప్రజా సంఘాల వారు .. కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి ఎలాంటి తీర్పు ఇవ్వకుండా.. విచారణ అనంతరం పెండింగులో పెట్టారు. దీనిని సవాల్ చేస్తూ.. ప్రభుత్వం త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషన్ వేసింది. తాజాగా ప్రభుత్వం వేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ సుమన్ వాదనలు వినిపిస్తూ.. క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు పెండింగులో ఉన్నాయని, వీటిని త్రిసభ్య ధర్మాసనానికి పంపారని సీజే ధర్మాస నం ముందు చెప్పారు. తీర్పు వచ్చే వరకు ఆఫీస్‌లు తరలించవద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తీర్పు రాకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేయలేకపోతుందన్నారు.
లంచ్‌మోషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ లాయర్ చెప్పగా.. ఇందులో అత్యవసరం ఏమీలేదని సీజే ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్బంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఎందుకు ఇంత తొందర పడుతున్నారు. ఇలా అయితే.. విశాఖకు వెళ్లలేరు“ అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జనవరి 2కు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. విశాఖను రాజధానిగా ప్రకటిస్తామని చెప్పిన తర్వాత అనేక కేసులు పడ్డాయి. దీంతో రాజధాని తరలింపు ప్రకటన ఆగిపోయాయి. కనీసం కార్యాలయాలనైనా తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.