తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఆయన వ్యవహార శైలి, దూకుడు తట్టుకోలేక సొంత పార్టీ నాయకులు, స్థానిక జర్నలిస్టులు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు చేస్తున్నారు. మాకు ఈ ఎమ్మెల్యే వద్దు బాబోయ్ వద్దంటూ లబోదిబో మంటున్నారు. నాలుగేళ్లు పాటు అమరావతి రైతు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి వెలుగులోకి వచ్చిన కొలికపూడికి గత ఎన్నికల్లో ఏరి కోరి మరీ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును టీడీపీ అధిష్టానం కేటాయించింది.
టీడీపీ నేతృత్వంలోని కూటమి మద్దతుగా నిలవడంతో ఆయన సులువుగా గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కొలికపూడి తన దూకుడు స్వభావాన్ని బయటపెట్టారు. సత్వర న్యాయం పేరుతో వైసీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త కాలసాని చెన్నారావు ఇంటిని కూల్చివేయడానికి యత్నించడం వివాదం అయింది. కొలికపూడిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సీఎం చంద్రబాబు కూడా ఆయన్ను మందలించారు.
అయినా కూడా కొలికపూడి తీరు మారలేదు. మొన్నటికి మొన్న చిట్టెల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దుర్భాషలాడారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ప్రస్తుతం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనతో సొంత పార్టీ నేతల్లో కొలికపూడిపై మరింత అసంతృప్తి ఏర్పడింది. మరోవైపు స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్థిస్తుండటంతో.. వారు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడటమే కాకుండా బెదిరిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే పై పలు ఆధారాలతో మీడియా వారు ఫిర్యాదులు అందించారు.
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీకి సంబంధించిన కొందరు నేతలు తిరువూరు లోని గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుకుపోతున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి `సేవ్ తిరువూరు` ర్యాలీకి రెడీ అయ్యారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కొలికపూడి తీరుపై మండిపడుతున్నారు. మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటే వద్దు అని సీఎంకు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్‌కు కంప్లైట్ చేశారు. కొలికపూడిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరిచారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధిష్ఠానం సేవ్ తిరువూరు ర్యాలీకి అడ్డుకట్ట వేసింది. ఇక మరి కొలికపూడి విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.