టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. సంక్రాంతికి రిలీజవుతున్న భారీ తెలుగు చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు దీటుగా తన నిర్మాణంలో రానున్న డబ్బింగ్ మూవీ వారసుడుకు థియేటర్లు అట్టిపెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొన్న రాజు.. చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు.
తమిళంలో 11నే రిలీజవుతున్న ఈ చిత్రాన్ని మూడు రోజులు వాయిదా వేసి 14న తెలుగులో రిలీజ్ చేయాలని రాజు నిర్ణయించాడు. చిరు, బాలయ్యల సినిమాల కోసమే తాను ఈ త్యాగం చేసినట్లు రాజు స్పష్టం చేశాడు. ఐతే నిజంగా రాజు ఇలా వెనక్కి తగ్గడానికి కారణాలేంటనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కొందరేమో 11కు సినిమా రెడీ అయ్యే అవకాశం లేకే వాయిదా వేశారంటుంటే.. కొందరేమో రాజుది త్యాగమే అంటున్నారు. మరికొందరేమో.. చిరు, బాలయ్య సినిమాలతో పోటీపడడం మంచిది కాదనే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే.. థియేటర్ల గొడవ, ఇతర కారణాల వల్ల వారసుడు సినిమా విషయంలో విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య, వీరిసింహారెడ్డిల ముందు వారసుడు వెలవెలబోవడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లయితే ఇచ్చుకున్నారు కానీ.. జనాలను రప్పించడం తేలిక కాదని రాజుకు అర్థమైనట్లుంది.
సినిమాకు డబ్బులు రావడం కష్టమే కాగా.. థియేటర్లను ఆ సినిమా కోసం బ్లాక్ చేశారన్న అపవాదుతో చిరు, బాలయ్యల అభిమానుల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడడం ఖాయం. ఆ ఇద్దరు హీరోల దృష్టిలో కూడా రాజు చెడయ్యే ప్రమాదం ఉంది. డబ్బులు రాని సినిమా కోసం ఇంత నెగెటివివిటీ మూటగట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో అన్నీ ఆలోచించి రాజు వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు.