విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2023 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలన్నీ హాజరై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయని జగన్ గర్వంగా చెబుతున్నారు. 20 రంగాల్లో ఆరు లక్షల మందికి ఉపాధి లభించబోతుందని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. కియా పరిశ్రమ 2017 లోనే పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందని, 20 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి కియా తీసుకొచ్చింది టిడిపి అని కియా ప్రతినిధులు నేడు చెప్పారని గుర్తు చేశారు. ఇందులో జగన్ చేసింది ఏముందని ప్రశ్నించారు. కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించుకోవడమే జగన్ కు తెలుసని ఎద్దేవా చేశారు.
మరోవైపు 2017లో విశాఖలో ఇదే పెట్టుబడుల సదస్సు సందర్భంగా వైసీపీ నేతలు నానాయాగీ చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇపుడు సదస్సు జరుగుతున్న సమయంలో టీడీపీ అధికారంలో ఉండి ఉంటే… ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు అంటూ వైసీపీ నేతలు గోల గోల చేసి ఉండే వారని విమర్శిస్తున్నారు. కానీ, టిడిపి అలా కాదని, ఎవరు పెట్టుబడులు తెచ్చినా రాష్ట్రాభివృద్ధే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
2017 లో వైజాగ్ లో ఈ సదస్సు జరుగుతున్న సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసిపి నేతలు నానా యాగీ చేశారని గుర్తు చేశారు. కానీ, ఈరోజు టిడిపి అలా చేయడం లేదని, రాష్ట్రం పట్ల చంద్రబాబుకున్న నిబద్ధత అటువంటిదని కామెంట్ చేస్తున్నారు. టిడిపికి వైసిపికి తేడా అదేనని ఇది ప్రజలకు తెలుసని చెబుతున్నారు.