వర్షాకాలంలో వర్షాలు పడతాయి…ఆ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు నిండి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి…రోడ్లపై గుంతలు ఉంటే అవన్నీ బురదతో చెరువులను తలపిస్తాయి…ఆ బురదమయమైన రోడ్లపై నడవలేక..వేరే మార్గంలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు..ఈ విషయాలన్నీ పదేళ్ల పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే, ఈ హితబోధ అంతా మంత్రి స్థాయిలో ఉన్న ధర్మాన ప్రసాదరావు చెప్పడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
జగనన్న కాలనీల్లో నీళ్లు చేరాయని, రోడ్లు బురద గుంతలుగా మారాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ విమర్శలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. వర్షాలు పడితే వాగులు పొంగవా? రహదారులు బురదమయం కావా? అని ధర్మాన ప్రశ్నించారు. అంతేకాదు, వర్షపు నీరు కాలనీల్లోకి చేరదా? అని నిలదీశారు. ఏమీ తోచకే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వే వల్ల వివాదాలు పరిష్కారమవుతున్నాయని చెప్పారు ధర్మాన. ఇప్పటి వరకు 27 లక్షల ఎకరాల భూమిపై హక్కులు కల్పించామని ఆయన వెల్డడించారు. ధర్మాన ఈ తరహాలో ట్రోలింగ్ కు గురయ్యే తరహాలో విమర్శలు గుప్పించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ధర్మాన టంగ్ స్లిప్ అయ్యారు. టీడీపీ కోసం పనిచేసే వాలంటీర్లను తీసివేయాలని, ఎలక్షన్ విధులు, ఓటర్ల సర్వే వాలంటీర్లు నిర్వహిస్తే తప్పేమిటని ధర్మాన పలికి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయి.