ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి సభకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ దూరంగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి గౌరవంగా కూర్చోబెట్టారు. ఆపై చంద్రబాబు అయ్యన్నపాత్రుడుపై ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టారు. మొదట స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడుకి ఆయన అభినందనలు తెలిపారు. స్పీకర్ అయ్యన పాత్రుడు గారు ఎంతో అనుభవం, వాగ్ధాటి ఉన్న వ్యక్తి అని.. ఆయనకు కోపం వస్తే ఉత్తరాంధ్ర పదునైన భాషలో రుషికొండను చెక్కినట్టు ప్రత్యర్థుల్ని మాటల్తో చెక్కేసేవారని పవన్ కొనియాడారు. గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలు ఆయన మాటల్లోని వాడి,వేడి చూసారు.. ఇప్పటి నుంచి ఆయన హుందాతనం చూస్తారని పవన్ తెలిపారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేదు.. కానీ సభలో స్పీకర్ గా ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉందంటూ పవన్ నవ్వులు పూయించారు.
ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జరిగిన సభ తీరును ఎండగడుతూ పవన్ పవర్ ఫుల్ పంచ్‌లు పేల్చేరు. గత ఐదేళ్లు సభలో బూతులు, వ్యక్తిగత దూషషణే ఉందని..అందుకే వాళ్లు 11 సీట్లకే పరిమితమయ్యారని వైకాపా నేతలపై పవన్ కౌంటర్ వేశారు. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదని.. భాష మనుషుల్ని కలపడానికే కానీ, విడగొట్టడానికి కాదని గుర్తు చేశారు.
అలాగే నేడు సభలో వైసీపీ సభ్యులు లేకపోవడాన్నికూడా పవన్ తప్పుబట్టారు. విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమిని తీసుకొనే ధైర్యం వాళ్లకు లేదని.. అందుకే ఈ రోజు సభలో లేకుండా పోయారన్నారు. ఇకపోతే 2047 నాటికి ఏపీ ఉన్నతంగా వుండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వెయ్యాలని.. ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశా నిర్దేశం చేసేలా వుండాలని పవన్ తన స్పీచ్ లో పేర్కొన్నారు.