ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 5న 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆప్ భావిస్తుండగా..ఈ సారి ఎలాగైనా దేశ రాజధానిలో కూడా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. 2014 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ హవా నడుస్తోన్నా…ఢిల్లీకి మాత్రం నేనే రాజు నేనే మంత్రి అని కేజ్రీవాల్ సీఎం పీఠంపై కూర్చున్నారు.
ఇక, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని, కాంగ్రెస్ తో పొత్తు లేదని కేజ్రీవాల్ తేల్చేశారు. దీంతో, ఢిల్లీలో త్రిముఖ పోరు తప్పలేదు. మరోవైపు, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సీఈసీ స్పష్టతనిచ్చింది. ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అవకతవకలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. రికార్డు స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.