ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) వ్యవహారంపై కొంతకాలంగా ఏపీలో పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఓటీఎస్ అనేది ఓ గొప్ప పథకం అని…దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయని ప్రభుత్వాధికారులు, సచివాలయ ఉద్యోగులు ఊదరగొడుతున్నారు. కానీ, ఆల్రెడీ పెళ్లైన తన భార్యతో మళ్లీ పెళ్లి చేస్తానన్నట్లు ఈ పథకం ఉందని చాలామంది బాధితులు సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్ల తర్వాత ఈ పథకం స్వచ్ఛందనని, ఇష్టం లేనివారు వద్దని చెప్పవచ్చని వైసీపీ నేతలు కొత్తవాదనను తెరపైకి తెచ్చారు.
కానీ, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అధికారులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వేరే ఆదేశాలిచ్చి పైసా వసూల్ కు టార్గెట్లు పెట్టారు. ఇక, కొందరు అధికారులైతే ఓటీఓస్ డబ్బులు కట్టకుంటే పథకాలు, పెన్షన్ లు నిలిపివేస్తామని సర్క్యులర్ లు, నోటీసులు, ఆడియో క్లిప్ లు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాకు ఓటీఎస్ సెగ తగిలింది. ఓటీఎస్ ఎందుకు చేసుకోవాలంటూ రోజాకు ఓ దళిత మహిళ చుక్కలు చూపించిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం దళితవాడలో పర్యటించారు రోజా. ఈ సందర్భంగా రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎప్పుడో కట్టుకున్న ఇంటికి ఇప్పుడొచ్చి పదివేలు కట్టమంటా ఉండారేమిటని ఓ మహిళ…రోజాను తమిళంలో ప్రశ్నించింది. ఓటీఎస్ కింద 10వేలు కట్టేస్తే ఇంక లోన్లు కట్టే పనే ఉండదని ఆమెకు రోజా నచ్చజెప్పబోయారు. 10 వేలు కట్టేస్తే పూర్తి హక్కులు వస్తాయని, కొత్తగా బ్యాంకు లోన్ కూడా తీసుకోవచ్చని చెప్తున్నా ఆమె వినలేదు. గతంలో లోన్లు ఎప్పుడో కట్టేశామని, మళ్లీ ఎందుకు కట్టాలని ఆమె రోజాను నిలదీసింది. దీంతో చేసేదేమీ లేక రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు.