నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజలతోపాటు పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత హఠాత్తుగా అకున్ సబర్వాల్ బదిలీ కావడంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజిలోకి చేరింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ కొత్త కోణంలో మొదలైంది.
డ్రగ్స్ కేసులో భారీ మొత్తంలో నగదు విదేశాలకు బదిలీ అయిందని ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉండడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ సహా పలువురిని ఈడీ విచారణ జరిపింది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలుగానే ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇకపై, డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లకు మినహాయింపు ఉండదని షాకింగ్ కామెంట్లు చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం అనేది ఇంటింటి సమస్యగా మారుతోందని ఆనంద్ చెప్పారు. డ్రగ్స్ వాడే వాళ్లను కట్టడి చేయనంత కాలం దీన్ని అరికట్టలేమన్నారు. ఇకపై, సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నారని ఆనంద్ పేర్కొన్నారు.
ఇక, దేశవ్యాప్త డ్రగ్స్ మాఫియాలో కింగ్ పిన్ అయిన టోనీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా ఆనంద్ ప్రకటించారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్న టోనీ.. దేశంలోని ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు. హైదరాబాద్లో పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు. టోనీతోపాటు హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతున్న తొమ్మిది మంది బడా వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆనంద్ ఈ కామెంట్లు చేశారు.