తిరుమల కు చెందిన అనేక వ్యవహారాలు రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి. లడ్డూ మొదలుకుని వైకుంఠ ఏకాదశి దర్శనాల వరకు.. రాజకీయాలకు కొదవలేదు. ఆ తర్వాత.. టీటీడీ బోర్డు సభ్యుడు ఒకరు సిబ్బందిపై నోరు చేసుకున్న తీరు, `థర్డ్ క్లాస్` అంటూ.. సదరు ఉద్యోగిని దూషించిన తీరు కూడా.. వివాదా నికి కేంద్రంగా మారింది. తర్వాత.. వరుస పెట్టి అపచారాలు జరుగుతూనే ఉన్నాయని.. హిందూ ధార్మిక సంఘాలు ఆరోపించాయి.
ఈ పరంపరలో ఇప్పుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే తిరుపతిలోని ఎస్వీ గోశాల వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఈ గోశాల గత వైసీపీ హయాంలోనే నిర్మించారు. అనేక మంది శ్రీవారి భక్తులు విరాళాలుగా గోవులను సమర్పించారు. సుమారు 4-6 వేల గోవుల వరకు ఉన్నాయి. అయితే.. వీటి నిర్వహణ సరిగా లేక.. వెయ్యికి పైగా గోవులు మృతి చెందాయని.. వైసీపీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రెండు రోజుల కిందట ఆరోపించారు.
ఇది పెను దుమారంగా మారింది. దీనిపై అధికార పార్టీ టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు కూడా పరస్పరం ఎదురుదాడి చేసుకున్నారు. కేవలం వృద్ధాప్య సమస్యలతోనే రెండు మూడు గోవులు మరణిం చాయంటూ.. ఆయా పార్టీల నాయకులు చెప్పుకొచ్చారు. తిరుమలను భ్రష్టు పట్టించింది మీరేనని వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. ఇక, వైసీపీ కూడా.. కాదు.. ఇదిగో ఆదారాలు అంటూ.. వరుస పెట్టి ఫొటో జాతర పెట్టింది. వాటిలో గోవులు మృతి చెందినట్టు కనిపిస్తోంది.
తాజాగా దీనిపై స్పందించిన పలువురు మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరుతూ.. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖలు సంధించారు. ఇక, ఈ విషయంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన నాయుడు.. గోవులు చనిపోయాయని ఒప్పుకొన్నారు. అయితే.. సంఖ్య ఎంతో తనకు తెలియదని చెబుతూనే.. భూమన వ్యవహారం మితిమీరిందన్నారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వెనుక కూడా ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.