ఏళ్లకు ఏళ్లుగా ప్రజలు ఛీ కొడుతున్నా.. కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోదా? జాతీయ స్థాయిలో అధికారాన్ని చేజార్చుకొని పదకొండేళ్లు కావొస్తోంది. మరో నాలుగేళ్లు.. ప్రతిపక్షంలోనే ఉండాల్సిన దుస్థితి. ఆ తర్వాత ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఎప్పటిలానే అవసరాలకు అనుగుణంగా.. తాను తీసుకున్న నిర్ణయాన్ని తానే వ్యతిరేకించే దరిద్రపుగొట్టు తీరు కాంగ్రెస్ పార్టీ సొంతం.
ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలోనూ అనుసరిస్తోంది.
ఆయన ప్రధానమంత్రిగా ఉన్న వేళలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో.. రాజ్ ఘాట్ లో ఒక్కొక్కరికీ ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు చోటు సరిపోవటం లేదని.. ఈ కారణంగా రాష్ట్రీయ స్మ్రతి స్థల్ లో మాజీ ప్రధానమంత్రుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలంటూ 2013లోని యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకున్నారు.
ఆ మంత్రివర్గానికి నాయకత్వం వహించింది మన్మోహన్ సింగే. అలాంటిది ఇప్పుడు ఆయన అంత్యక్రియలకు రాజ్ ఘాట్ లో ప్రత్యేక స్మారక స్థలం కావాలంటూ కాంగ్రెస్ పార్టీ స్వయంగా కోరుతోంది. అంతేకాదు.. మన్మోహన్ కు ప్రత్యేకంగా స్మారక స్థలిని ఏర్పాటు చేయకపోవటం అంటే.. దేశ తొలి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేయటం చూస్తే.. కాంగ్రెస్ బుద్ధి ఎప్పటికి మారదా? అన్న భావన కలుగక మానదు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచటమే కాదు.. కీలక సమయంలో పాలనా పగ్గాలు చేపట్టి దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన పీవీ నరసింహారావుకు ఇవ్వని గౌరవాన్ని.. ఆయన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ కు ఇవ్వటం గమనార్హం.
పీవీ మరణించినప్పుడు ఆయన భౌతికకాయాన్ని సైతం ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా గేటు మూసేసిన కాంగ్రెస్ పార్టీ.. పీవీ భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు పంపేసి.. అంత్యక్రియలు చేయించిన దుర్మార్గం తెలిసిందే.
ఇప్పుడు మాత్రం మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియల్ని రాజ్ ఘాట్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. అక్కడే ఒక ప్రత్యేక స్మారకస్థలిని ఏర్పాటు చేయాలని కోరుతోంది. వీపీ సింగ్.. మొరార్జీ దేశాయ్.. పీవీ నరసింహారావులు మినహా దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన వారందరి అంత్యక్రియలు ఢిల్లీలోనే జరగటం తెలిసిందే.
పీవీ మరణించినప్పుడు ఆయన పట్ల అంత కఠినంగా వ్యవహరించిన కాంగ్రెస్.. మన్మోహన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ వేషాలు కానీ.. అధికారంలో ఉండి ఉంటే.. మన్మోహన్ విషయంలోనూ కూరలో కరివేపాకు మాదిరి వ్యవహరించి ఉండేదన్న మాట వినిపిస్తోంది.