తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరి పాకాన పడ్డట్లు కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో మూలిగే నక్క మీద తాటికాయ చందంగా టీ కాంగ్రెస్ మీద సీనియర్ల బాంబు పడింది. దీంతో, ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను హై కమాండ్ ట్రబుల్ షూటర్ గా పంపించింది. అయితే, పంచాయతీ చేయడానికి వచ్చిన డిగ్గీ రాజా ముందే కాంగ్రెస్ చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. గాంధీభవన్ లో రేవంత్ వర్గీయులకు, అసమ్మతి వర్గీయులకు మధ్య సంధి చేయడానికి వచ్చిన దిగ్విజయ్ వారితో చర్చిస్తున్నారు. అదే సమయంలో గాంధీ భవన్ బయట పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అనిల్ ను ఓయూ విద్యార్థి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఉత్తమ్ కుమార్ ను తిడతావా అంటూ అనిల్ ను నిలదీశారు. ఉత్తమ్ కు అనిల్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో, అనిల్, ఉత్తమ్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల వారు చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించారు. దీంతో, సీనియర్ నేత మల్లు రవి వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలా గొడవలు పడి కొట్టుకోవడం వల్ల పార్టీ పరువు బజారున పడి పార్టీకి నష్టం జరుగుతుందని హితవు పలికారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.