కీలకమైన పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు, పొగలు కక్కుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై బీజేపీ నాయకులు, బీజేపీ నేతలపై కాంగ్రెస్ నాయకులు విమర్శల జడివాన కురిపించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నాయకురాలు చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. మరికొందరు.. ఏకంగా సోనియాగాంధీ మౌనంగా ఉన్నారంటూ.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయం ఒక్కసారిగా ప్రకంపనలకు గురైంది.
ఏం జరిగింది?
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పలు స్థానాల్లో సిట్టింగులను మార్చేసి.. కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఇలా ఇచ్చిన వారిలో సినీ ప్రముఖులు సహా.. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ వివాదాస్పద గ్రామంలో అత్యాచారానికి గురైన బాధితురాలు కూడా ఉంది. అయితే.. సినీనటి, వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉండే కంగనా రనౌత్‌కు బీజేపీ తొలిసారిగా అవకాశం ఇచ్చింది. ఆమె కొన్ని రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఆమెకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ కేటాయించింది. దీంతో కంగన.. ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు.
అయితే.. కంగనకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకురాలు, భారత్ జోడో యాత్ర పుస్తక రచయిత సుప్రియా శ్రీనతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “వేశ్యకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇదీ.. బీజేపీ ప్రజాస్వామ్యం. మహిళలకు ఇదేనా వారిచ్చే గౌరవం“ అని వ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కంగన కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. “వేశ్య కూడా మనిషే. నేను సినిమాల్లో కళాకారిణి. ఏ అవకాశం ఇచ్చినా చేయాలి.
అందుకే అనేక పాత్రలు చేశాను. వేశ్యలకు కూడా మనసు ఉంటుంది. వారిని కూడా గౌరవించాల్సిన హక్కు ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. కాంగ్రెస్‌కు మహిళలను గౌరవించే పరిస్థితి లేదు“ అని విమర్శించారు. ఇక, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఈ విషయంపై ఫైరయ్యారు. శ్రీనతే వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. సోనియాగాంధీ కూడా మహిళే. ఇలాంటి వ్యాఖ్యలపై మౌనం వహించి.. సమర్ధిస్తారా? అని నిలదీశారు.