రాజకీయాలకు.. రాజకీయ నేతలకు నమ్మకాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అధినేతలకు ఉండే నమ్మకాలకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు రూపంగా చెప్పాలి. సచివాలయానికి వాస్తు బాగోలేదన్న మాటను మొత్తంగా నమ్మే కేసీఆర్.. పాత సచివాలయాన్ని కూల్చేసి.. వందల కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయాన్ని కట్టించుకొని.. అప్పుడు కానీ రెగ్యులర్ గా వెళ్లని వైనం తెలిసిందే. ఇందుకు భిన్నంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యవహరిస్తూ అందరిని మరోసారి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
వాస్తు దోషం పేరుతో ఏళ్లకు ఏళ్లుగా మూసి ఉంచిన తలుపుల్ని తెరిపించిన ఆయన.. ఆ ద్వారం గుండా లోపలకు వెళ్లిన సిద్దరామయ్య సాహసం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని విధానసౌధలోని మూడో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంది. దానికి దక్షిణంలో ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారానికి వాస్తు దోషం ఉందని.. దాన్ని తెరిస్తే.. ముఖ్యమంత్రి పదవి పోతుందన్న నమ్మకం ఉంది. 1998లో అప్పటి సీఎం జీహెచ్ పటేల్ దక్షిణ దిక్కులో ఉన్న తలుపును తెరిపించి.. పశ్చిమ దిక్కులో ఉన్న తలుపును మూయించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ ఓడిపోయింది.
దీంతో.. ఆ తర్వాత అధికారంలో వచ్చిన వారు ఆ తలుపును మూయించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ దక్షిణ దిక్కులో ఉన్న ద్వారాన్ని తెరిసే సాహసం చేయలేదు. 2018లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిద్దూ.. తొలిసారి దక్షిణ దిక్కులో ఉన్న ద్వారాన్నితెరిపించారు. ఈ వైనం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
ఆ తర్వాత సిద్దూ పదవి పోవటం.. ఆ తర్వాత వచ్చిన సీఎంలుకూడా దాన్ని తెరిచే ధైర్యం చేయలేదు. కానీ..తాజాగా సీఎం కుర్చీలో కూర్చున్న సిద్దూ.. ఎప్పటిలానే.. మూసి ఉన్న దక్షిణ ద్వారాన్ని తెరిపించారు. 1996 తర్వాత ఆ రెండుసార్లు తలుపును తీయించిన క్రెడిట్ సిద్దరామయ్యకే దక్కుతుంది. మరిప్పుడేం జరుగుతుందో చూడాలి. నమ్మకాలపై విశ్వాసం ఉన్న వారు సిద్దూ తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకుంటున్నారంటే.. వ్యతిరేకించే వారు మాత్రం ఆయన్ను అభినందిస్తున్నారు. మరేం జరగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.