మాజీ సీఎం, మాజీ క్రికెటర్ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ ముఖ్య నేతలు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరుల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకొన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదన్నారు.
60 ఏళ్లుగా తమ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను వీడతానని ఏనాడూ అనుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయం వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు పవర్ మాత్రమే కావాలని నిప్పులు చెరిగారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. హైకమాండ్ తెలుసుకోలేకపోతోందని కిరణ్ వ్యాఖ్యానించారు. ఎవరినీ సంప్రదించకుండానే రాష్ట్ర విభజన చేశారని.. అనేక నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చేసిన తప్పేంటన్నది కూడా కాంగ్రెస్ తెలుసుకోవడం లేదన్నారు. ఓటముల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవడం లేదని కిరణ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవ చూసిన తనకు బీజేపీ అయితేనే కరెక్ట్ అని భావించి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలిపారు. అవినీతి రహితంగా.. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధిక మెజారిటీతో తిరిగి అధికారం దక్కించుకోవడం.. అంత ఈజీకాదన్న ఆయన.. ఇది మోడీకే సాధ్యమైందని కితాబిచ్చారు. తనకు పార్టీలో ఎలాంటి పని అప్పగించినా చేస్తానని కిరణ్ చెప్పారు.