కాదు.. లేదు.. అంటూనే ఏపీ ప్రభుత్వం కాగల కార్యం వడివడిగా చేసేస్తోంది. విశాఖను పాలనా రాజధానిని చేస్తానని చెప్పిన సీఎం జగన్‌కు.. ఆ పార్టీ నాయకులకు .. న్యాయ స్థానం ఆదేశాలు అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే చేస్తామని.. అన్ని వనరులు ఉన్న విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పిన వైసీపీ సర్కారుకు న్యాయస్థానం కొన్ని బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖకు తరలిపోవాలన్న దూకుడు ఆగింది.
అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి.. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖకు వెళ్లిపోవాలనే సీఎం జగన్ భావిస్తు న్నారు. ఈ క్రమంలో తన కాపురం అక్కడే అంటూ.. తేల్చి చెప్పారు కూడా. దీనికి ముహుర్తాలు కూడా ప్రకటించారు. ఉగాది-దసరా.. అంటూ రెండు మూడు ముహూర్తాలు వెల్లడించారు. అయితే.. అవి కూడా సాధ్యం కాలేదు. ఇంతలో ప్రభుత్వ కార్యాలయాలను, మంత్రులకు నివాసాలను చూడాలంటూ.. ఆదేశాలు ఇచ్చారు. ఇది రాజధాని తరలింపులో భాగం కాదని కూడా చెప్పుకొచ్చారు.
ఇక, ఇప్పుడు తాజాగా 35 ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ.. వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇక, వెళ్లిపోవడం ఖాయమైంది. అదేసమయంలో ఉన్నతాధికారుల వసతి ఏర్పాట్లు, గుర్తింపుపై మరో జీవోను విడుదల చేసింది. ఉత్తరాంధ్ర ప్రగతి, విభజన చట్టం పేరుతో విశాఖకు వెళ్లేందుకు సిద్ధమైన సర్కారు.. విశాఖలో మిలీనియం టవర్లు ఏ, బీలో సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు మరమ్మతులు చేసి అకామిడేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ బ్లాకులల్లోని లక్షా 75వేల 516 చదరపు అడుగులను వినియోగించుకోవాలని వెల్లడించింది.