విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పోస్కో కంపెనీతో జగన్ ఎప్పుడో డీల్ మాట్లాడుకున్నారని, ఇపుడేమో కేంద్రానికి లేఖ అంటూ నాటకాలాడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల డ్రామాలపై టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల కోసం జగన్ నాటకం ఆడుతున్నారని, ఏడాది క్రితమే పోస్కోతో జగన్‌కు ఒప్పందం కుదిరిందని పట్టాభిరామ్ ఆరోపించారు. రౌడీయిజానికి, బెదిరింపులకు లొంగే వ్యక్తులం కాదని, జగన్ రేపోమాపో చిప్పకూడు తినక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ డ్రామాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?.. లేక రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారా? అని జగన్ ను పట్టాభి ప్రశ్నించారు.
రూ.2లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ కన్ను పడిందని, ఆ భూమిని కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తోందని అన్నారు. విజయసాయి రెడ్డి లాంటి పందికొక్కులకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీలో చోటు లేదని మండిపడ్డారు. అటువంటి వారిని ప్రజలు తరమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్నాటకాలను ప్రజలు అర్ధం చేసుకుని నిలదీయాలని పట్టాభి పిలుపునిచ్చారు. చంద్రబాబు కూడా ఇదే పిలుపునిచ్చారని గుర్తు చేశారు.