టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా మరోసారి నందమూరి బాలకృష్ణ సమర్పిస్తున్న అన్‌స్టా పబుల్ సీజన్-4కు హాజరయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఒకసారి చంద్రబాబు హాజరయ్యారు. అప్పట్లో ఆ ఎపిసోడ్ సంచలనం సృష్టించింది. భారీ సంఖ్యలో వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇక, ఇప్పుడు అధికారంలో ఉండడంతోపాటు.. ముఖ్యమంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు.. ఈ షోలో పాల్గొన్నారు. ఈ స్ట్రీమింగ్ ఈనెల 25న ప్రసారం కానుంది.
అయితే.. అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు-బాలయ్యల మధ్య సాగిన సంభాషణ, అడిగిన ప్రశ్నలు, చంద్రబాబు సమాధానాలు వంటివాటికి సంబంధించి టీజర్ తాజాగా విడుదలైంది ఇది ప్రస్తుతం సోషల్ డియాలో దుమ్ము రేపుతోంది. ప్రధానంగా ఈ షోలో రాజకీయ పరమైన అంశాలే ఎక్కువగా కనిపించాయి. చంద్రబాబు అరెస్టు, కూటమి పార్టీల పొత్తు కుదరడం, పవన్ కల్యాణ్‌తో కలిసి అధికారంలోకి రావడం వంటి అంశాలను బాలయ్య సూటిగా ప్రశ్నించారు.
ఇదేసమయంలో కుటుంబాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే.. వాటిలో రాజకీయా లపై చంద్రబాబు తడబాటు లేకుండా సమాధానం చెప్పగా.. కుటుంబానికి సంబంధించిన ప్రశ్నల విష యంలో మాత్రం కొంతమేరకు భావోద్వేగానికి గురయ్యారు. అయినప్పటికీ.. తన చతురతను వినియోగించి సమాధానాలు చెప్పడం గమనార్హం. “నేను మాస్ హీరో అయితే.. మీరు మాస్ లీడర్’ అని బాలకృష్ణ అనగా ‘బోత్ ఆర్ నాట్ సేమ్’ అంటూ చంద్రబాబు ఆన్సర్ చెప్పడం విశేషం.
అరెస్టుపై..
వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 53 రోజుల పాటు ఆయనను జైల్లో పెట్టారు. దీనిపై అడిగిన ప్రశ్నకు.. చంద్రబాబు ఆసక్తిగా సీరియస్‌గా సమాధానం చెప్పారు. “నేను పర్యాటన నిమిత్తం బస్సులో ప్రయాణిస్తుండగా ‘మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం’ అంటూ ఫోన్ వచ్చింది. 53 రోజుల పాటు జైల్లో ఉన్నా. తలుపు కొడితే తీసేవారు కాదు. మనసులో ఏదో బాధ.. చావు గురించి ఆలోచించలేదు. కానీ 53 రోజులు ఒకటే ఆలోచన“ అని సమాధానం చెప్పడం గమనార్హం.