ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నదాతలకు సూపర్ గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతుభరోసా పథకం క్రింద అర్హులైన ప్రతి రైతుకి రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవగా మార్చబడిన రైతుభరోసా పై బిగ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు రూపొందించాలని సూచన చేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు బ్యాంకు ఖాతాలతో రైతుల మొబైల్ నెంబర్లను లింక్ చేయాలని సీఎం వివరించారు.
అలాగే ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకోసం విపత్తుల సహాయ నిధి నుంచి రూ. 36 కోట్లు విడుదల చేయాలని తాజాగా ఆర్థిక శాఖను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో విత్తన కొరత లేకుండా చూసుకోవాలని..వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు.